Bangladesh: బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ ఘన విజయం: రెండు దశాబ్దాల తర్వాత అధికార పగ్గాలు
రెండు దశాబ్దాల తర్వాత అధికార పగ్గాలు

Bangladesh: బంగ్లాదేశ్‌లో సుమారు ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. దేశంలో జరిగిన 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అత్యధిక స్థానాలు సాధించి, ఘన విజయాన్ని అందుకుంది. మూడింట రెండు వంతులకు మించిన సీట్లు గెలుచుకుని, 20 ఏళ్ల తర్వాత మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. మొత్తం 299 పార్లమెంటు స్థానాల్లో బీఎన్‌పీ 209 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. పాకిస్థాన్‌తో దగ్గరి సంబంధాలున్న మతపరమైన పార్టీ జమాత్-ఏ-ఇస్లామీ 68 సీట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, బీఎన్‌పీ అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్ (60) దేశ కొత్త ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. బీఎన్‌పీ చివరిసారిగా 2001లో అధికారంలోకి వచ్చి, 2006 వరకు పాలన సాగించింది. ఆ తర్వాతి ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ వరుస విజయాలు సాధించింది. 2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళనలతో హసీనా ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక సలహా మండలి దేశ పాలనను చూస్తోంది. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 59.44 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికలతోపాటు, జులై నేషనల్ ఛార్టర్‌గా పిలుచుకునే 84 అంశాల సంస్కరణల ప్యాకేజీపై రిఫరెండం కూడా జరిగింది. ఈ సంస్కరణలకు 60.26 శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారని ఎన్నికల సంఘం సీనియర్ సెక్రటరీ అహ్మద్ అక్తర్ తెలిపారు.
35 సంవత్సరాల తర్వాత మగ ప్రధాని!
బంగ్లాదేశ్‌లో గత 35 ఏళ్లుగా మహిళా నాయకులే ప్రధాన మంత్రులుగా కొనసాగారు. ఈ కాలంలో అవామీ లీగ్ నేత షేక్ హసీనా, బీఎన్‌పీ నేత ఖాలిదా జియాలు మాత్రమే దేశ నాయకత్వాన్ని చేపట్టారు. ఇప్పుడు తారిఖ్ రెహమాన్ ప్రధానిగా ఎన్నికైతే, 35 ఏళ్ల తర్వాత ఆ పదవిని అలంకరించిన మొదటి పురుషుడిగా రికార్డు సృష్టిస్తారు. ఖాలిదా జియా కుమారుడైన రెహమాన్ 2008లో దేశం విడిచి బ్రిటన్‌కు వెళ్లిపోయారు. 17 సంవత్సరాల పాటు అక్కడ ప్రవాస జీవితం గడిపారు. గత ఏడాది డిసెంబర్‌లో స్వదేశం తిరిగి వచ్చి, తల్లి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టారు. బీఎన్‌పీని విజయవంతంగా నడిపించి, ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపొందారు.
ఢాకా-3 నియోజకవర్గం నుంచి బీఎన్‌పీ నేత, హిందూ సమాజ నాయకుడు గాయేశ్వర్ చంద్రరాయ్ భారీ మెజార్టీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థి షాహినూర్ ఇస్లామ్‌పై 99,163 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జమాత్ తరఫున పోటీ చేసిన ఏకైక హిందూ అభ్యర్థి కృష్ణ నంది ఖుల్నా-1లో ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఏడుగురు మహిళలు విజేతలుగా నిలిచారు. వీరిలో ఆరుగురు బీఎన్‌పీకి చెందినవారు, మరొకరు స్వతంత్రురాలు.
హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన విద్యార్థుల ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) కేవలం 6 స్థానాలకు పరిమితమైంది. ఈ పార్టీ జమాత్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది.
మోదీ అభినందనలు
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ విజయాన్ని అందుకున్న అనంతరం, పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రెహమాన్ నాయకత్వంపై ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసానికి ఈ ఫలితాలు అద్దం పడతాయని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యం, అభివృద్ధి దిశగా సాగుతున్న బంగ్లాదేశ్‌కు భారత్ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీనికి బీఎన్‌పీ కూడా మోదీకి కృతజ్ఞతలు తెలిపింది.

