Canada Shock: కెనడా షాక్: భారతీయ విద్యార్థుల 74% వీసా దరఖాస్తులు తిరస్కరణ
74% వీసా దరఖాస్తులు తిరస్కరణ

Canada Shock: కెనడాలో ఉన్నత విద్యా కోరికపై ఆశాభవంతో ఉన్న భారతీయ విద్యార్థులకు తీవ్ర అఘాతం. ప్రతి నలుగురు దరఖాస్తుదారుల్లో ముగ్గురి వీసాలు తిరస్కరించబడ్డాయి. ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం, 2025 ఆగస్టులో భారతీయులు చేసిన స్టడీ పర్మిట్ దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరణ రేటు నమోదైంది. 2023లో ఇది కేవలం 32 శాతమే ఉండగా, ఇప్పుడు భారీ పెరుగుదల గమనించబడింది.
చైనా విద్యార్థుల వీసాల తిరస్కరణ 24 శాతంగా ఉండగా, మిగతా దేశాల సగటు 40 శాతం మాత్రమే ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల వీసా విధానాన్ని కఠినతరం చేస్తున్న కెనడా, ఈ దిశగా తీసుకుంటున్న చర్యలతో భారతీయ దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గుతోంది. గతేడాది కెనడాలో 10 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పించగా, వీరిలో 41 శాతం భారతీయులే ఉన్నారు. చైనా, వియత్నాం దేశాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
స్థానిక నివాస సౌకర్యాల కొరత, మౌలిక సదుపాయాల ఇబ్బందులు, ఖర్చుల భారం వంటి సమస్యలు కారణంగా కెనడా ఈ తీర్పులు తీసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అమెరికా, కెనడాలకు ప్రత్యామ్నాయంగా జర్మనీ వైపు భారతీయ విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు.

