మధ్య ఆసియా వ్యాపార మార్గం బలోపేతం

Chabahar Port: ఇరాన్‌లోని చాబహార్ పోర్టు కార్యకలాపాలకు అమెరికా ఆంక్షల మినహాయింపును భారత్ పొడిగించుకుంది. 2026 జనవరి వరకు ఈ మినహాయింపు కొనసాగుతుందని భారత ప్రభుత్వం తెలిపింది. గతంలో ఇచ్చిన ఆరు నెలల మినహాయింపు ముగిసిన నేపథ్యంలో ఈ పొడిగింపు వచ్చింది. దీంతో చాబహార్‌లోని షహీద్ బెహెస్తీ టెర్మినల్ అభివృద్ధి, నిర్వహణలకు భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ పోర్టు ద్వారా మధ్య ఆసియా దేశాలతో భారత వాణిజ్యం మరింత బలపడుతుందని అధికారులు చెప్పారు.

చాబహార్ పోర్టు భారత్‌కు విదేశీ వాణిజ్యంలో కీలక మార్గంగా మారింది. ఇక్కడి అభివృద్ధిలో భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. కజఖిస్థాన్, కిర్గిజ్‌రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలకు సరకులు రవాణా చేయడానికి ఈ పోర్టు ఉపయోగపడుతుంది. పాకిస్థాన్ మార్గాన్ని అవలంబించకుండా అఫ్గానిస్థాన్‌కు భారత్ అందించే ఆహార ధాన్యాలు, ఇతర సహాయాలు కూడా ఇక్కడి ద్వారానే పంపిస్తున్నారు. గత ఏడాది భారత్-ఇరాన్ మధ్య 10 సంవత్సరాల టెర్మినల్ నిర్వహణ ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం తర్వాత అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై విధించిన ఆంక్షలు కొనసాగుతాయని, టెహ్రాన్‌తో వ్యాపార లావాదేవీలు చేస్తే ఆ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపింది. అయితే, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఈ ఒప్పందాన్ని మానవతా దృక్పథంతో చూడాలని, సంకుచిత దృష్టికి లొంగకూడదని స్పష్టం చేశారు. ఈ మినహాయింపు పొడిగింపు భారత విదేశీ విధానానికి మరింత బలం చేకూర్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story