ప్రత్యర్థులు కాకుండా భాగస్వాములుగా మారాలి: చైనా విదేశాంగ మంత్రి

China Foreign Minister: భారత్, చైనాల మధ్య సంబంధాలు పరస్పర ప్రత్యర్థిత్వం కాకుండా బలమైన భాగస్వామ్యంగా ఉండాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టం చేశారు. ఇరు దేశాలు ఒకరినొకరు ముప్పుగా చూడకుండా, అభివృద్ధి కోసం సహకరించే అవకాశంగా భావించాలని ఆయన సూచించారు.

చైనా రాజధాని బీజింగ్‌లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మీడియా వార్షిక సమావేశంలో వాంగ్ యీ మాట్లాడుతూ, ‘‘అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఇరు దేశాలు సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ దిశగా కృషి చేయాలి’’ అని పేర్కొన్నారు.

2024లో కజాన్‌లో జరిగిన మోదీ-జిన్‌పింగ్ భేటీతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. గత ఏడాది తియాంజిన్‌లో ఇరునేతల భేటీ తర్వాత సంబంధాలు మరింత బలపడ్డాయని వివరించారు. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకోవడం, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడటం వంటి అంశాలు రెండు దేశాలకూ లాభదాయకంగా నిరూపితమయ్యాయని చెప్పారు.

భారత్, చైనాలు సత్సంబంధాలు, స్నేహాన్ని కాపాడుకోవాలని వాంగ్ యీ ఒత్తిడి చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగిస్తూ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. పొరుగు దేశాలుగా, గ్లోబల్ సౌత్ సభ్యులుగా ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని, పరస్పర విశ్వాసం, సహకారాలు రెండు దేశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. విభజనవాదం, ఘర్షణలు అభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్చరించారు.

ఇంకా, ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను – ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను వాంగ్ యీ తీవ్రంగా ఖండించారు. ఎక్కువ సైనిక బలం ఉన్నంత మాత్రాన యుద్ధానికి అది సరైన కారణం కాదని, ప్రపంచం మళ్లీ ఆటవిక రాజ్య వైపు వెళ్లకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story