భారత్‌లో చైనా ఆన్‌లైన్ వీసా సేవలు

China Visa Application: దాదాపు ఐదేళ్ల క్రితం గాల్వన్ లోయ ఘర్షణల కారణంగా భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ చేదు జ్ఞాపకాలను వెనుకకు నెట్టి, ఇరు దేశాలు ఇప్పుడు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఇటీవల చైనా పౌరుల కోసం టూరిస్ట్ వీసాలను పునరుద్ధరించిన తర్వాత భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం మరో కీలక ప్రకటన చేసింది. చైనా రాయబారి షూ ఫెయీహాంగ్ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల నుంచే భారత్‌లో చైనా ఆన్‌లైన్ వీసా సిస్టమ్ ప్రారంభం కానుంది.

చైనా ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ వివరాలు

కొత్త సంవత్సరం ప్రారంభానికి కొద్ది రోజుల ముందు, డిసెంబర్ 22, 2025 నాడు ఈ ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ సిస్టమ్ అధికారికంగా ప్రారంభమవుతుంది. దరఖాస్తుదారులు ఈ కొత్త ఆన్‌లైన్ సిస్టమ్ కింద ఫామ్ నింపి, అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి నిర్దేశించిన వెబ్‌సైట్ అడ్రస్: visaforchina.cn/DEL3_EN/qianzh. చైనా రాయబారి షూ ఫెయీహాంగ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు.

ఈ ఆన్‌లైన్ ప్రకటనతో పాటు, న్యూఢిల్లీలో ఉన్న చైనా వీసా అప్లికేషన్ సర్వీస్ సెంటర్ చిరునామా, సంప్రదింపు వివరాలు కూడా తెలిపారు. కాన్‌కోర్స్ ఫ్లోర్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్, బాబా ఖడక్ సింగ్ మార్గ్, కన్నాట్ ప్లేస్, న్యూఢిల్లీ-110001. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తుంది. పూర్తి వివరాల కోసం 91-9999036735 నంబర్ సంప్రదించవచ్చు.

జూన్ 2020లో గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత, చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలపై నిషేధం విధించారు. ఈ ఘటన భారత్-చైనా సంబంధాలను అత్యంత కనిష్ట స్థాయికి చేర్చింది. ఆ తర్వాత, దౌత్యపరమైన చర్చలు, కమాండర్ స్థాయి సమావేశాల ద్వారా ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకున్నాయి. నిరంతర చర్చలు, ఒప్పందాల ద్వారా పరిస్థితి నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చింది. ఆన్‌లైన్ వీసా సిస్టమ్ ప్రారంభం కావడం వల్ల వీసా ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇది ఇరు దేశాల మధ్య వ్యాపారం, పర్యాటకం, ప్రజల పరస్పర సంబంధాలు తిరిగి మెరుగుపడటానికి, బలోపేతం కావడానికి గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది.

Updated On 9 Dec 2025 11:06 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story