AI Surveillance on United States Military Movements: పశ్చిమాసియాలో ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో చైనా బహిరంగంగా యుద్ధం ముగించాలని ఇరు వర్గాలకు సూచిస్తున్నప్పటికీ, రహస్యంగా ఇరాన్‌కు సహకరిస్తున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రైవేట్ టెక్ కంపెనీలు అమెరికా సైన్యం మోహరింపులు, ఆయుధ నిల్వలు, యుద్ధ విమానాలు, విమానవాహక నౌకల కదలికలు, సైనిక స్థావరాలపై నిరంతర నిఘా పెడుతున్నాయని తెలిసింది.

చైనా కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను, ఓపెన్ సోర్స్ డేటాను ఉపయోగించి ఈ నిఘా చేస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదికలు సూచిస్తున్నాయి. బహిరంగంగా అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారం (AIS) వంటి డేటాను ఏఐ సాయంతో విశ్లేషించి అమెరికా సైనిక కార్యకలాపాలను ఖచ్చితంగా ట్రాక్ చేస్తున్నాయి. ఈ సమాచారాన్ని ఇరాన్ సైనిక ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

హాంగ్‌జౌలోని మిజార్ విజన్ వంటి చైనా కంపెనీలు అమెరికా విమానవాహక నౌకలు యుఎస్‌ఎస్ అబ్రహం లింకన్, యుఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ కదలికలను ట్రాక్ చేసి వివరాలు వెల్లడి చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాల్లో ఎన్ని యుద్ధ విమానాలు మోహరించాయనే వివరాలు కూడా ఏఐ సాయంతో బయటపెడుతున్నాయి. ఈ నిఘా టూల్స్‌ను బహిరంగంగా మార్కెటింగ్ చేస్తూ వ్యాపారం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

నిఘా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఏఐ పరికరాలతో ఎవరైనా ఎక్కడి నుంచైనా విమానాల కమ్యూనికేషన్లను విశ్లేషించవచ్చని, భారీ సైనిక కదలికలను సులభంగా పర్యవేక్షించవచ్చని హెచ్చరించారు. ఈ ముప్పును ఎదుర్కోవడం కోసం అమెరికా అధికారులు, నిపుణులు వివిధ ఎంపికలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికా ప్రభుత్వం సివిలియన్ ఉపగ్రహ చిత్రాల అమ్మకాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు నివేదికలు ఉన్నాయి.

ఈ పరిణామాలు అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. చైనా ఏఐ సాంకేతికత ద్వారా ఓపెన్ డేటాను ఉపయోగించి సైనిక రహస్యాలను బయటపెట్టడం భవిష్యత్ యుద్ధాల్లో కొత్త సవాళ్లను సృష్టించవచ్చని నిపుణులు అంటున్నారు.

Next Story