Delcy Rodríguez: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్

Delcy Rodríguez: వెనెజువెలా ఉపాధ్యక్షురాలు మరియు చమురు, ఆర్థిక శాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా ఆపరేషన్‌లో నిర్బంధానికి గురికావడంతో, దేశ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఈ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. వెనెజువెలా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు లేనప్పుడు ఉపాధ్యక్షుడు తాత్కాలికంగా అధికారం చేపట్టాల్సి ఉంటుంది. దేశ సైనిక నాయకత్వం కూడా ఆమెకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో రోడ్రిగ్జ్ పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో లోపెజ్ ప్రకారం, రోడ్రిగ్జ్ 90 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఈ కాలంలో కొత్త ఎన్నికలు జరిపి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, డెల్సీ రోడ్రిగ్జ్ టెలివిజన్ ప్రసంగంలో మదురోనే దేశానికి చట్టబద్ధమైన అధ్యక్షుడిగా పేర్కొన్నారు. "దేశానికి ఒక్కడే అధ్యక్షుడు ఉన్నారు. ఆయనే నికోలస్ మదురో" అని ఆమె స్పష్టం చేశారు. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, మదురోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం రోడ్రిగ్జ్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఆమె అమెరికా సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారని, వెనెజువెలాను మరింత బలోపేతం చేయడంలో సహకరిస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు దేశంలో పెద్ద మద్దతు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
డెల్సీ రోడ్రిగ్జ్‌కు అమెరికా వ్యాపారవర్గాలు, చమురు పరిశ్రమలతో మంచి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ద్వారా వెనెజువెలా పరిస్థితి స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మదురో నిర్బంధం వివరాలు
అమెరికా సైనిక చర్యల్లో మదురో దంపతులను న్యూయార్క్‌కు తరలించారు. శనివారం సాయంత్రం మన్‌హటన్‌లోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. వారిపై నార్కో-టెర్రరిజం, మాదకద్రవ్యాల రవాణా వంటి ఆరోపణలు ఉన్నాయి. బ్రూక్లిన్ జైలులో విచారణ జరగనుంది.
కారకాస్‌లో అమెరికా దాడుల్లో 40 మందికి పైగా మరణించినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ చర్యల చట్టబద్ధతపై అంతర్జాతీయంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

