Rubio: రూబియో ఆదేశంతో ఇరాన్ బృందం అమెరికా వీడిందా?.. వార్తలను ఖండించిన టెహ్రాన్
వార్తలను ఖండించిన టెహ్రాన్

Rubio: అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని అమెరికా నుంచి వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశించినట్లు ఆక్సియోస్ కథనం వెల్లడించింది. టెహ్రాన్ ప్రతినిధులతో ఇక చర్చలు కొనసాగించే ఉద్దేశం లేదని రూబియో స్పష్టం చేశారని, చర్చలు ముందుకు సాగకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కథనం పేర్కొంది.
అయితే ఈ వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికా విడిచి వెళ్లాలని తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారమే తమ ప్రతినిధి బృందం న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చిందని తెలిపింది. చర్చలు పూర్తిగా నిలిచిపోయాయనే వార్తలను కూడా ఇరాన్ తోసిపుచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో ‘సమయం వస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అణు కార్యక్రమంపై ఇరాన్ నుంచి స్పష్టమైన హామీలు కోరుతున్నట్లు అమెరికా పదే పదే చెబుతోంది. టెహ్రాన్ మాత్రం తమ అణు పరిశోధనలు దేశ శాంతియుత ప్రయోజనాలకేనని వాదిస్తోంది. ఈ అంశాలపై ఇరుదేశాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతినిధి బృందాన్ని అమెరికా పంపించేసిందంటూ వస్తున్న వార్తలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగనున్నాయా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

