Discontent Over Trump’s Immigration Policies in the US: అమెరికాలో ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలపై అసంతృప్తి: ఆమోదం ఆల్ టైమ్ లోయెస్ట్ స్థాయికి చేరుకుంది
ఆమోదం ఆల్ టైమ్ లోయెస్ట్ స్థాయికి చేరుకుంది

Discontent Over Trump’s Immigration Policies in the US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలు చాలా దూరం వెళ్లిపోయాయని అమెరికన్లు భావిస్తున్నారు. రాయిటర్స్-ఇప్సాస్ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలపై అమలు చేస్తున్న నిబంధనలు ఇప్పుడు ఆయనకు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.
సర్వే ప్రకారం, ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలను ఆమోదించే వారి శాతం 39కి పడిపోయింది. ఇది ఆయన తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అతి తక్కువ స్థాయి. ఇంతకుముందు ఈ నెలలోనే ఆ రేటు 41 శాతంగా ఉండగా, ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 53 శాతం మంది అమెరికన్లు ఈ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ రెండో ఇనాగ్యురేషన్ తర్వాత మొదట్లో వలసల అంశంలో ఆయనకు మంచి మద్దతు ఉండేది. ఫిబ్రవరిలో 50 శాతం మంది ఆమోదించారు కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
అక్రమ వలసదారులను అరికట్టడానికి ట్రంప్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించింది. మినియాపొలిస్‌లో ఇటీవల జరిగిన ఘర్షణలో ఒక అమెరికా పౌరుడు ఇమిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో మరణించాడు. ఈ ఘటన సర్వే నిర్వహణ సమయంలోనే (శుక్రవారం నుంచి ఆదివారం వరకు) జరిగింది. ఇలాంటి ఘటనలు ప్రజల్లో అసంతృప్తిని మరింత పెంచాయి. ట్రంప్ మొత్తం ఆమోదం కూడా 38 శాతానికి పడిపోయింది, ఇది ఆయన ప్రస్తుత టర్మ్‌లో అతి తక్కువ స్థాయి.
ట్రంప్ ప్రభుత్వం వలసలను కఠినంగా అదుపు చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది. మొదట్లో ఇది ఆయనకు రాజకీయంగా లాభదాయకంగా కనిపించినా, ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఆమోదం తగ్గుముఖం పట్టింది. ఈ సర్వే ఫలితాలు ట్రంప్ పాలనపై మరింత ఒత్తిడిని తీసుకొస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

