Discrimination Against Indians in Texas, USA: అమెరికాలో టెక్సాస్‌లో భారతీయులపై వివక్ష: హెచ్-1బీ వీసాదారులు నగరాన్ని 'ఆక్రమించారు' అంటూ ఆరోపణలు
హెచ్-1బీ వీసాదారులు నగరాన్ని 'ఆక్రమించారు' అంటూ ఆరోపణలు

ఫ్రిస్కో నగర కౌన్సిల్ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. భారతీయ-అమెరికన్లు తీవ్ర ఖండన
Discrimination Against Indians in Texas, USA: టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలో హెచ్-1బీ వీసా దారులు (ప్రధానంగా భారతీయులు) నగరాన్ని ఆక్రమించారని, జనాభా మార్పులు జరుగుతున్నాయని కొందరు స్థానిక నివాసులు, కన్జర్వేటివ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి 3న జరిగిన నగర కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై జరిగిన చర్చలు వివక్షాపూరిత వాతావరణాన్ని సృష్టించాయి.
సోషల్ మీడియాలో కైలీ కాంబెల్, మార్క్ పలాసియానో వంటి కన్జర్వేటివ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో "అమెరికా ఫస్ట్" టోపీలు, మాస్క్‌లు, కొందరు కాన్ఫెడరేట్ ఫ్లాగ్‌లతో పాల్గొన్నారు. వారు హెచ్-1బీ వీసాల్లో మోసాలు జరుగుతున్నాయని, అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు లాక్కొంటున్నారని ఆరోపించారు. మార్క్ పలాసియానో మాట్లాడుతూ, "ఇక్కడ భారతీయ జనాభా పెరగడం యాదృచ్ఛికం కాదు. వీసాల జారీలో మోసాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ ప్రాంతం మొత్తం భారతీయులతో నిండిపోతుంది. అమెరికన్లు ఇప్పుడే మేలుకోవాలి" అని పేర్కొన్నారు.
ఫ్రిస్కోలో భారతీయ మూలాలున్న జనాభా 2010లో 10 శాతం నుంచి ఇప్పుడు 33 శాతానికి పెరిగిందని ప్రభుత్వ సర్వేలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై విమర్శలు మరింత తీవ్రమవుతున్నాయి.
అయితే, సమావేశంలో హాజరైన అనేకమంది ఇండో-అమెరికన్లు (భారతీయ మూలాలున్న అమెరికన్లు) ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హెచ్-1బీ వీసాల్లో మోసాలు ఉంటే వాటిని వ్యతిరేకిస్తామని, కానీ ఇక్కడి భారతీయ సమాజాన్ని మొత్తంగా నిందించడం తప్పు అని స్పష్టం చేశారు. తాము ఈ నగరంలో నివసిస్తున్నందువల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి ప్రయోజనాలు చేకూరుతున్నాయని వాదించారు.
ఫ్రిస్కో మేయర్ జెఫ్ చెనీ భారతీయ నివాసులకు మద్దతుగా నిలిచారు. నగర కౌన్సిల్ సభ్యులు హెచ్-1బీ వీసా విధానంపై నియంత్రణ లేనప్పటికీ, ఈ చర్చ దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షించింది.
ఈ ఘటన టెక్సాస్‌లో ఇటీవలి కాలంలో హెచ్-1బీ వీసాలపై పెరిగిన వివాదాలకు మరో ఉదాహరణగా నిలిచింది. ఇటీవలే టెక్సాస్ గవర్నర్ కొత్త హెచ్-1బీ దరఖాస్తులను నిలిపివేసిన నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు మరింత ఉద్ధృతమవుతున్నాయి.

