Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు ఇంకా సందిగ్ధతలోనే కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఇరాన్‌కు చెందిన వందలాది చమురు నౌకలు అమెరికా వైపు మళ్లించబడుతున్నట్లు ఆయన ఆరోపించారు. “ఇరాన్ నాయకత్వమే తమ చమురును అమెరికా తీసుకోవడానికి అనుకూలంగా నౌకలపై ఒత్తిడి తెచ్చింది. ఈ నౌకల గమ్యస్థానం టెక్సాస్, లూసియానా, అలాస్కా రాష్ట్రాలు కావచ్చు” అని ట్రంప్ స్పష్టంగా రాశారు. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన ఇంకా వెల్లడించలేదు.

ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా తప్పక గెలుస్తుందని ట్రంప్ ధీమాతో పేర్కొన్నారు. అదే సమయంలో యుద్ధం పై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న అమెరికా మీడియా సంస్థలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “అమెరికా సైనిక కార్యకలాపాలు అత్యుత్తమంగా సాగుతున్నాయి. మా దళాల పనితీరు అసాధారణమైనది” అంటూ ట్రూత్ సోషల్‌లో మరో పోస్టు చేసి సైనికులను ప్రశంసించారు.

ఒప్పందం కుదరకపోతే ఇరాన్ నౌకలపై దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. దీని వల్ల ఇరాన్‌కు రోజుకు 500 మిలియన్ డాలర్ల నష్టం జరుగుతోందన్నారు. పాకిస్థాన్ వేదికగా ఇరాన్ చర్చలకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్, “ఒకవేళ చర్చలకు రాకపోతే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు. ఇరాన్ తమతో ఒక ఒప్పందం కుదుర్చుకుని తమ దేశాన్ని తిరిగి అభివృద్ధి చేసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అణ్వాయుధాల విషయంలో మాత్రం ఇరాన్ ఎలాంటి సామర్థ్యం కలిగి ఉండకూడదని ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు.

ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నట్లే కనిపిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story