Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగించి శాంతి చర్చలు జరపడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి సంబంధిత అంశాల్లో ఇరాన్ తమకు చాలా పెద్ద, అపార విలువైన ‘బహుమతి’ ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. అణు ఆయుధాల తయారీని ఎప్పటికీ చేపట్టకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించినట్లు కూడా సూచించారు.

మంగళవారం వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాలు వెల్లడించారు. “నిన్న ఇరాన్ ఒక అద్భుతమైన పని చేసింది. మాకు ఒక బహుమతి ఇచ్చింది. ఆ బహుమతి ఈరోజే మాకు చేరింది. అది చాలా పెద్దది.. అపారమైన విలువైనది. దాని వివరాలు మాత్రం చెప్పను.. కానీ అది మాకు ఒక మహత్తరమైన బహుమతి” అని ట్రంప్ అన్నారు.

ఈ బహుమతి అణు సంబంధితమైనది కాదని, చమురు-గ్యాస్ రంగానికి చెందినదని, హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)తో ముడిపడినదని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ జలసంధి ద్వారా సురక్షితంగా ఇంధనాలు తరలించడానికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందం లేదా రాయితీ ఇరాన్ నుంచి వచ్చినట్లు అర్థమవుతోంది.

ఇరాన్‌తో ఒక మంచి ఒప్పందం కుదుర్చుకోవాలని తాను ఆసక్తిగా ఉన్నానని, ఆ దేశంలోని సరైన వ్యక్తులతో మాట్లాడుతున్నామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ యుద్ధం ముగించి శాంతి మార్గం అవలంబించాలని కోరుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తించాయి. ఇరాన్ మాత్రం ఇలాంటి ఏ ఒప్పందం గురించి అధికారికంగా వెల్లడించలేదు. ట్రంప్ ప్రకటనలు యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి, చర్చలకు దారి తీస్తాయా అనేది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Next Story