Donald Trump: అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం త్వరలో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ పోరును మరింత తీవ్రతరం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. పశ్చిమాసియాలో తమ సైనిక కార్యకలాపాలను బలోపేతం చేయడానికి వేలాది మంది యూఎస్‌ సైనికులను మోహరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని రాయిటర్స్‌ తన కథనంలో వెల్లడించింది.

అమెరికా అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘పశ్చిమాసియాలో మా కార్యకలాపాలను బలపరచడానికి వేలాది సైనికులను అక్కడ మోహరించాలని ప్రభుత్వం యోచిస్తోంది’’ అని పేర్కొన్నారు. హర్మూజ్‌ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రవాణాకు వైమానిక, నావికాదళాల ద్వారా రక్షణ కల్పించే అంశంపై కూడా చర్చలు జరిగాయి. దీని కోసం ఇరాన్‌ తీర ప్రాంతంలో యూఎస్‌ బలగాలను మోహరించాల్సి రావచ్చని అంచనా వేశారు.

ఇరాన్‌ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్‌ ద్వీపానికి కూడా యూఎస్‌ సైనికులను పంపే విషయంపై చర్చలు జరిగినట్లు తెలిసింది. అయితే, ఈ ఆపరేషన్‌ అత్యంత ప్రమాదకరమని ఒక అధికారి హెచ్చరించారు. ఈ ప్రణాళికలన్నీ చర్చల స్థాయిలోనే ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పెంటగాన్‌ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్‌ నౌకలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 120 ఇరాన్‌ నౌకలను ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ యుద్ధంలో 13 మంది యూఎస్‌ సైనికులు మరణించగా, సుమారు 200 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రభుత్వం మరిన్ని బలగాలను మోహరించే ఆలోచనలో ఉంది.

Next Story