Donald Trump: ఇంకో రెండు-మూడు వారాల్లో ఇరాన్ యుద్ధం ముగుస్తుంది: ట్రంప్ కీలక సంకేతం
ట్రంప్ కీలక సంకేతం

వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
Donald Trump: పశ్చిమాసియాలో ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలు రెండు నుంచి మూడు వారాల్లో ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.
“మేము ఇరాన్ నుంచి అతి త్వరలోనే వైదొలగనున్నాం. బహుశా అది రెండు నుంచి మూడు వారాల్లో జరగవచ్చు” అని ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆధారపడకుండానే తమ సైనిక చర్యలు ముగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. “వారు నాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒప్పందం చేసుకుంటారా లేదా అనేది అప్రస్తుతం” అని స్పష్టం చేశారు.
ఇరాన్ అణు సామర్థ్యం తగ్గిన తర్వాతే అక్కడి నుంచి వైదొలుగుతామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌తో కలిసి చేసిన దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఆ దేశం కోలుకోవడానికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుందని అన్నారు. ఇరాన్‌కు సరైన నాయకత్వం లేదని, వారు చర్చలకు వస్తే మంచిదని, రాకపోయినా పర్వాలేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
తమ ఆపరేషన్ లక్ష్యం నెరవేరిందని, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని ట్రంప్ పేర్కొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించేందుకు ఇరాన్‌లో సైనిక చర్యలు ముగించడమే తన ప్రణాళిక అని చెప్పారు. “మేము అతి త్వరలో అది చేస్తాం. అప్పుడు ధరలు తగ్గిపోతాయి” అని వివరించారు.
ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా స్పందించారు. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని, త్వరలోనే ఇది జరగనుందని ఆయన మీడియాతో తెలిపారు.
బుధవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) అధ్యక్షుడు ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ ప్రసంగంలో ఇరాన్‌కు సంబంధించి మరిన్ని ముఖ్యమైన ప్రకటనలు ఉండే అవకాశం ఉంది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఇటీవల తీవ్రరూపం దాల్చాయి. ఇస్ఫహాన్ నగరంపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు జరిగినట్లు ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

