దైవిక జోక్యమే పాక్‌ను రక్షించింది: ఆసిమ్ మునీర్

Asim Munir: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్తాన్ తీవ్ర నష్టాలు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ సైన్యాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ దేశాన్ని ‘దైవిక జోక్యం’ కాపాడిందని ఆయన అన్నారు.

ఇటీవల ఇస్లామాబాద్‌లో నిర్వహించిన నేషనల్ ఉలెమా కాన్ఫరెన్స్‌లో ఆసిమ్ మునీర్ ప్రసంగించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ భారీ దెబ్బ తిన్నప్పుడు మా సాయుధ దళాలకు దైవిక సహాయం లభించింది. దాన్ని మేం స్పష్టంగా అనుభవించాం’’ అని మునీర్ పేర్కొన్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఆ సమావేశంలో అఫ్గానిస్తాన్‌తో సరిహద్దు ఘర్షణలపై కూడా మునీర్ మాట్లాడారు. ‘‘పాకిస్తాన్ చిన్నారుల రక్తాన్ని అఫ్గాన్ కళ్లతోనే చూస్తోంది. మా దేశంలోకి చొరబడుతున్న తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ముఠాల్లో 70 శాతం మంది అఫ్గాన్ పౌరులే ఉన్నారు. తాలిబాన్ ప్రభుత్వం సీమాంతర ఉగ్రదాడులను ప్రోత్సహించడం వెంటనే ఆపాలి’’ అని హెచ్చరించారు.

గత ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలతో పాటు సైనిక స్థావరాలపై నాలుగు రోజుల పాటు భారత్ దాడులు జరిపింది. భారీ నష్టాలు పడిన పాకిస్తాన్ చర్చలకు ఒప్పుకున్న తర్వాతే దాడులు నిలిచాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story