ఎబోలా వ్యాప్తి భయంకరం

ఎబోలా ఆసుపత్రిపై యువకుల దాడి.. బంధువుల శవాలు లాక్కెళ్లారు!
ఈశాన్య కాంగోలో ఎబోలా వ్యాప్తి భయంకర రూపం సంతరించుకుంటోంది. వైరస్ నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యం, నిధుల కొరతలతో పాటు ఆసుపత్రులపై దాడులు పెరుగుతున్నాయి.
Ebola Spread: ఆఫ్రికా ఖండంలో ఎబోలా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని వణకిస్తోంది. ఈశాన్య కాంగోలోని బునియా నగరంలో మే 15న తొలి కేసు నమోదు కాగా, అంతకు దాదాపు రెండు నెలల ముందే వైరస్ వ్యాప్తి మొదలైనట్లు అంతర్జాతీయ విచారణలో తేలింది. అయినా అధికారులు సమర్థవంతమైన చర్యలు చేపట్టకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఐసోలేషన్, రక్షణ సామగ్రి లోపం
బునియాలో ఎబోలా లక్షణాలున్న వారిని ఐసోలేషన్‌లో ఉంచడం, వైద్యులు పీపీఈ కిట్లు ధరించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు కూడా సరిగా అమలు కావడం లేదు. శానిటైజర్లు, టెస్ట్ కిట్లు కొరతగా ఉండటంతో రోజుకు 20 నుంచి 40 మందికి మాత్రమే పరీక్షలు చేయగలుగుతున్నారు. జనరేటర్లకు ఇంధనం కూడా సరిపడా లభ్యం కావడం లేదు.
నిధుల కొరత తీవ్రం
గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో కాంగోకు ఇచ్చే నిధుల్లో భారీ కోత విధించడంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అంతర్జాతీయ సహాయ సంస్థల్లో కూడా నిధుల కొరత ఏర్పడింది. దీంతో వైద్య సౌకర్యాలు కల్పించడం కష్టసాధ్యమవుతోంది. 1976 నుంచి ఇది కాంగోలో 17వ ఎబోలా వ్యాప్తి. ప్రస్తుతం బుండిబుగ్యో స్ట్రెయిన్ చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పటివరకు 900 కేసులు నమోదు కాగా, మరణాల రేటు 40 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆసుపత్రిపై యువకుల దాడి
ఇదిలా ఉండగా, ఎబోలా రోగులకు చికిత్స అందిస్తోన్న ఒక ఆసుపత్రిపై ఆదివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. ఎబోలా వ్యాధితో మృతి చెందిన ఇద్దరు బంధువుల శవాలను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. వైరస్ వ్యాప్తి భయంతో అధికారులు ఎబోలా మృతుల అంత్యక్రియలు చేపడుతున్న విషయం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. సంప్రదాయాల ప్రకారం అంత్యేష్టి కార్యక్రమాలు జరగకపోవడాన్ని నిరసిస్తూ యువకులు ఈ చర్యకు పాల్పడ్డారు. దీంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం పెరిగిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ఎబోలాను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. భారత్‌తో సహా అనేక దేశాలు అప్రమత్తం అయి సరిహద్దు జాగ్రత్తలు చేపట్టాయి. కాంగోలో తక్షణం సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

