అమెరికా న్యాయశాఖ స్పష్టీకరణ

Epstein Files: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణానికి చెందిన దాదాపు 30 వేల పేజీల పత్రాలను అమెరికా న్యాయశాఖ (DOJ) మంగళవారం విడుదల చేసింది. ఈ ఫైల్స్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై న్యాయశాఖ తక్షణమే స్పందించి, ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వెరిఫై చేయని సంచలనాత్మక వాదనలు మాత్రమేనని తేల్చి చెప్పింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసిన న్యాయశాఖ, ఈ ఆరోపణలను వాస్తవాలుగా పరిగణించరాదని స్పష్టం చేసింది.

విడుదలైన పత్రాల్లో 1995లో ట్రంప్-ఎప్‌స్టీన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించి ఓ డ్రైవర్ చెప్పిన వివరాలు ఉన్నాయి. అందులో ట్రంప్ ఎప్‌స్టీన్ పేరును పదేపదే ప్రస్తావించడం, అమ్మాయిల విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారనే విషయాలు పేర్కొన్నారు. అలాగే, ట్రంప్ మరియు ఎప్‌స్టీన్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలకు చెందిన పత్రాలు కూడా ఉన్నాయి. ఇంకా, డాక్టర్ లారీ నాసర్‌కు ఎప్‌స్టీన్ రాసినట్లు కనిపించే ఓ లేఖ కూడా విడుదలైంది – కానీ ఫోరెన్సిక్ పరీక్షల్లో అది నకిలీ అని నిర్ధారణ అయింది.

న్యాయశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పత్రాల్లోని కొన్ని విషయాలు పూర్తిగా అవాస్తవాలు. ముఖ్యంగా ట్రంప్‌పై ఉన్న ఆరోపణలు నిరాధారమైనవేనని, వాటిలో నిజాయితీ లేదని పేర్కొన్నారు. ఒకవేళ నిజమైతే ఇప్పటికే చర్యలు తీసుకునేవాళ్లమని, ఇవి కేవలం రాజకీయ ఎన్నికల సమయంలో (2020లో) రాజకీయ ప్రత్యర్థులు సృష్టించిన సంచలనాలేనని వివరించారు.

అదనంగా, 2020లో ఫెడరల్ ప్రాసిక్యూటర్ల నుంచి వచ్చిన ఓ రహస్య ఈ-మెయిల్ వివరాలు కూడా ఈ ఫైల్స్‌లో ఉన్నాయి. అందులో 1993-96 మధ్య కాలంలో ట్రంప్ ఎప్‌స్టీన్ ప్రైవేట్ జెట్‌లో దాదాపు 8 సార్లు ప్రయాణించారనే విషయం వెల్లడైంది. అయితే ఇందులో ఎలాంటి నేరారోపణలు లేవు. ఇక ఈ తాజా పత్రాల్లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

ఈ విడుదలతో ఎప్‌స్టీన్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. అయితే ట్రంప్‌పై ఆరోపణలు పూర్తిగా ఖండించబడటంతో, ఈ ప్రచారం త్వరలోనే చల్లారే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story