Dubai Airport: ఇరాన్ డ్రోన్ దాడి భయం: దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఇంధన ట్యాంక్‌పై దాడి.. విమాన సేవలు తాత్కాలికంగా సస్పెండ్!
విమాన సేవలు తాత్కాలికంగా సస్పెండ్!

Dubai Airport: పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రం చేస్తోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్లు దాడి చేయడంతో పెను ఉద్రిక్తత నెలకొన్నది. ఒక డ్రోన్ సమీపంలోని ఇంధన ట్యాంక్‌ను నేరుగా ఢీకొట్టడంతో భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు కానీ, భారీ నష్టం వాటిల్లింది.
దీంతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ విమానాశ్రయాన్ని తక్షణం మూసివేసి, అన్ని విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది భద్రత కోసం సేఫ్టీ నోటీసులు జారీ చేసి, విమాన స్టేటస్ తెలుసుకునేందుకు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది. పలు విమానాలను సమీపంలోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
ఇంధన ట్యాంక్‌పై అంటుకున్న మంటలను ఆర్పేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు తీవ్రంగా పని చేస్తున్నాయి. సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ దాడి నేపథ్యంలో ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాల వద్ద భద్రతను మరింత పెంచారు.
ఈ ఘటనలో కొచ్చి నుంచి దుబాయ్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం కూడా ప్రభావితమైంది. బయలుదేరిన కొద్ది సేపటి తర్వాత విమానాశ్రయం మూసివేత వార్త అందడంతో ఆ విమానాన్ని తిరిగి కొచ్చికి మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా చేరుకున్నారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఇరాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతా జాగ్రత్తలు మరింత పెంచాల్సి వచ్చింది. విమానాలు ఎప్పుడు సాధారణ స్థితికి వచ్చేయన్న విషయం ప్రస్తుతం స్పష్టం కాలేదు.

