New York Mayor: నెతన్యాహు అరెస్టు బాధ్యత ఫెడరల్ ప్రభుత్వానిదే: న్యూయార్క్ మేయర్
న్యూయార్క్ మేయర్

New York Mayor: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్ట్ వారెంట్ అమలు చేసే అధికారం తనకు లేదని న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ స్పష్టం చేశారు.
గతంలో నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే అరెస్ట్ చేయిస్తానని ప్రకటించిన మమ్దానీ, ఇప్పుడు అమెరికా చట్టాల ప్రకారం అది సాధ్యం కాదని అంగీకరించారు. "ఐసీసీ అరెస్ట్ వారెంట్‌ను అమలు చేసే అధికారం న్యూయార్క్ నగరానికి లేదా మేయర్ కార్యాలయానికి లేదు. నెతన్యాహు ఓ వార్ క్రిమినల్ అయినా మేము అరెస్ట్ చేయలేము. ఈ అధికారం అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి ఉంది. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి అమెరికా అధ్యక్షుడు చర్యలు తీసుకోవాలి" అని మమ్దానీ డిమాండ్ చేశారు.
2024లో గాజా యుద్ధంలో యుద్ధ నేరాల ఆరోపణలపై ఐసీసీ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను ఖండించింది. ఐసీసీ అధికార పరిధిని ఇజ్రాయెల్ అంగీకరించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో స్పందిస్తూ, నెతన్యాహు అమెరికాలో ఉన్నంత వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అరెస్ట్ కాదని స్పష్టం చేశారు.
ఈ వివాదం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలు అమెరికా ఫెడరల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఉన్నాయి.

