Qatar: రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలో అగ్నిప్రమాదం.. ఖతార్‌కు భారీ దెబ్బ
ఖతార్‌కు భారీ దెబ్బ

Qatar: ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి కీలకమైన ఖతార్‌లోని రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని బర్జాన్ గ్యాస్ సప్లై ఫెసిలిటీలో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 54 మంది గాయపడగా, 18 మంది ఇప్పటికీ జాడ లేకుండా కనిపించడం లేదు. పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, అగ్నిప్రమాదాన్ని త్వరగా అదుపు చేశారని అధికారులు తెలిపారు.
ఈ ప్లాంట్‌ను ఇరాన్-అమెరికా యుద్ధం సమయంలో ఇరాన్ దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. దీంతో గ్యాస్ ఉత్పత్తి భారీగా దెబ్బతిని, ఎగుమతులు నిలిపివేయాల్సి వచ్చింది. ఇటీవల ఉద్రిక్తతలు తగ్గడంతో ఖతార్ ఉత్పత్తి పునఃప్రారంభించే ప్రయత్నాలు చేపట్టింది. ఆ సమయంలోనే ఈ 'టెక్నికల్ ఇన్సిడెంట్' జరిగిందని ఖతార్‌ఎనర్జీ సంస్థ వెల్లడించింది. ఇది ఆపరేషనల్ సమస్య మాత్రమేనని, ఏ దురదృష్టకర చర్య లేదని అధికారులు స్పష్టం చేశారు.
రస్ లఫాన్ ప్రపంచంలోనే అతిపెద్ద LNG (ద్రవీకృత సహజ వాయువు) ఎగుమతి కేంద్రాల్లో ఒకటి. ఇక్కడి నుంచి జపాన్, దక్షిణ కొరియా, భారత్, చైనా, ఐరోపా దేశాలకు గ్యాస్ ఎగుమతి జరుగుతుంది. భారత్ ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో ఖతార్ వాటా 40-47% వరకు ఉంటుంది. 2024లో భారత్-ఖతార్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2028 నుంచి 20 ఏళ్లపాటు ఏటా 7.5 మిలియన్ టన్నుల LNG సరఫరా చేయాల్సి ఉంది. ఈ ఘటన ప్రపంచ శక్తి మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఈ సంఘటన ఖతార్ ఆర్థిక వ్యవస్థకు కూడా తాత్కాలిక సవాలుగా మారవచ్చు.

