Khamenei’s Sharp Counter to Trump: మీ సొంత దేశం మీద దృష్టి పెట్టండి: ఇరాన్ నిరసనలపై ట్రంప్‌కు ఖమేనీ కౌంటర్
ఇరాన్ నిరసనలపై ట్రంప్‌కు ఖమేనీ కౌంటర్

Khamenei’s Sharp Counter to Trump: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆందోళనకారులను తీవ్రంగా హెచ్చరించిన ఆయన, విదేశీ శక్తులకు కిరాయి బంట్లుగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నేరుగా ఉద్దేశిస్తూ, ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ముందు సొంత దేశ సమస్యలపై దృష్టి సారించాలని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు ఖమేనీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
ఆందోళనకారులు వీధులను నాశనం చేసి, విదేశీ అధ్యక్షుడిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఖమేనీ ఆరోపించారు. ప్రవాసంలో ఉన్న మాజీ యువరాజు రెజా పహ్లావి (గతంలో అమెరికా మద్దతుతో పాలన సాగించిన షా కుటుంబ వారసుడు) పిలుపుతో ఇరాన్‌లో నిరసనలు ముమ్మరమయ్యాయని ఆయన అన్నారు. గురువారం ప్రారంభమైన ఈ ఆందోళనలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను పూర్తిగా నిలిపివేసినప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
ఈ నేపథ్యంలో స్పందించిన సుప్రీం లీడర్ ఖమేనీ, దేశ యువత ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశం ఐకమత్యంతో ఉన్నప్పుడే ఏ శత్రువునైనా ఎదుర్కొనే శక్తి సాధ్యమని ఆయన నొక్కి చెప్పారు. విదేశీ శక్తుల ప్రేరేపిత చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

