ఇండోనేషియన్ మోడల్ మనోహర ఒడెలియా ఆవేదన

Indonesian Model Manohara Odelia in Distress: ఇండోనేషియన్-అమెరికన్ మోడల్ మనోహర ఒడెలియా పినోట్ తన గతంలోని బాధాకరమైన వివాహ జ్ఞాపకాలను మరోసారి బయటపెట్టారు. మలేషియా కెలాంటన్ రాష్ట్ర యువరాజు టెంగ్కు మహమ్మద్ ఫఖ్రీ పెట్రాతో తనకు ఏర్పడిన బంధం ఒక భయంకర పీడకల మాదిరి అని, అది తాను కోరుకున్నది కాదని ఆమె స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సుదీర్ఘ సందేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

2008లో జరిగిన ఈ వివాహం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పుడు యువరాజు వయసు 31 ఏళ్లు కాగా, మనోహర వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆమె మైనర్ వయసులో జరిగిన ఈ పెళ్లి చట్టబద్ధమైనది కాదని, బలవంతంగా జరిగిందని ఆమె ఇప్పుడు ఆరోపిస్తున్నారు. వివాహం తర్వాత తనపై కఠిన నిఘా పెరిగిందని, తల్లిదండ్రులతో కూడా సంప్రదింపులు అనుమతించలేదని, తనను మనిషిగా కూడా గౌరవించలేదని గతంలోనే ఆమె ఆరోపణలు చేశారు.

2009లో యువరాజు తండ్రి ఆరోగ్య కారణాలతో రాజ కుటుంబం సింగపూర్‌కు వెళ్లిన సమయంలో, అక్కడి హోటల్ నుంచి అమెరికన్ ఎంబసీ, స్థానిక అధికారులు మరియు తన తల్లి సహాయంతో మనోహర పారిపోయారు. ఆ తర్వాత వారి బంధం అధికారికంగా ముగిసింది.

తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాశారు: “నా టీనేజ్ వయసులో ఏర్పడిన ఆ బంధం చట్టబద్ధమైనది కాదు. అది నేను ఇష్టపడి చేసుకున్నది కాదు. అప్పుడు నేను మైనర్‌ని. నాకు స్వేచ్ఛగా ఎంచుకునే వయసు లేదు. నిజమైన చట్టబద్ధమైన వివాహంలో ‘మాజీ భార్య’ అనే పదం సరిపోతుంది. కానీ నా విషయంలో ఇన్నేళ్లుగా ఆ పదాన్ని వాడుతున్నారు. అది నిజాన్ని వక్రీకరిస్తుంది. నన్ను ప్రస్తావించేటప్పుడు ఆ పదం ఉపయోగించవద్దని, ముఖ్యంగా ఇండోనేషియా మీడియాను కోరుతున్నాను.”

ఈ ఘటన ద్వారా బాల్య వివాహాలు, బలవంతపు సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. మనోహర ఒడెలియా తన అనుభవాన్ని బయటపెట్టడం ద్వారా ఇలాంటి బాధితులకు ధైర్యాన్ని ఇస్తున్నారని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story