Fresh Unrest in Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లరులు.. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ మరణంతో ఆగ్రహావేశాలు
విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ మరణంతో ఆగ్రహావేశాలు

Fresh Unrest in Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మరణంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారంలో ఉండగా జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన హాదీ.. సింగపూర్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఢాకా సహా పలు నగరాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి.
ఎవరీ ఉస్మాన్ హాదీ?
బంగ్లాదేశ్‌లోని ఝల్‌కాతీ జిల్లాలో 1994లో జన్మించిన ఉస్మాన్ హాదీ.. చిన్నవయసు నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. గతేడాది జులైలో కోటా సంస్కరణల డిమాండ్‌తో ప్రారంభమైన విద్యార్థుల తిరుగుబాటులో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆ ఉద్యమం ఫలితంగా ఏర్పడిన 'ఇంక్విలాబ్ మంచ్' అనే రాజకీయ సంస్థకు కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసినందుకు, ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించే మ్యాప్‌లను షేర్ చేసినందుకు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
దాడి నుంచి మరణం వరకు..
తాత్కాలిక ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్‌ను రాజకీయ పార్టీగా గుర్తించకపోవడం, రానున్న ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడంతో హాదీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఢాకా-8 నియోజకవర్గం నుంచి ప్రచారం చేస్తుండగా.. డిసెంబరు 12న ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన హాదీని.. పరిస్థితి విషమించడంతో సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించారు. తూటా గాయం వల్ల మెదడుకు తీవ్ర నష్టం జరిగిందని వైద్యులు తెలిపారు.
దేశవ్యాప్త ఆందోళనలు..
హాదీ మరణ వార్త వెలువడగానే ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మీడియా కార్యాలయాలు, అవామీలీగ్ ఆఫీసులకు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు, హాదీ మరణానికి గాను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఒకరోజు జాతీయ సంతాప దినం ప్రకటించింది.

