Fuel Shortage in Russia: ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యాలో ఇంధన కొరత.. సంవత్సరాంతం వరకు ఎగుమతుల నిషేధం
సంవత్సరాంతం వరకు ఎగుమతుల నిషేధం

Fuel Shortage in Russia: ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా ఇంధన సరఫరా వ్యవస్థలపై నిరంతర దాడులు చేయడంతో ఆ దేశంలో చమురు కొరత ఏర్పడింది. దీంతో అన్ని రకాల ఇంధన ఎగుమతులను సంవత్సరాంతం వరకు నిలిపివేయాలని క్రెమ్లిన్ ఆదేశాలు జారీ చేసింది.
ఎండాకాలంలో రష్యా చమురు శుద్ధి కేంద్రాలు, పంపింగ్ స్టేషన్లు, ఇంధన రవాణా రైళ్లపై ఉక్రెయిన్ దాడులు ముమ్మరం చేసింది. ఈ సీజన్‌లో ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో ఇంధన డిమాండ్ పెరుగుతుంది. రష్యాలో కొరత సృష్టించడమే లక్ష్యంగా ఉక్రెయిన్ ఈ దాడులు ప్లాన్ చేసింది. అయితే, రష్యా అధికారులు రవాణా వ్యవస్థల్లో సమస్యలను కారణంగా చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరా మునుపటిలానే కొనసాగుతుందని చెబుతున్నారు.
ఉక్రెయిన్ మాత్రం రష్యాలోని పలు ఇంధన ఉత్పత్తి కేంద్రాలు, పంపింగ్ స్టేషన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంటోంది. ఇటీవల దక్షిణ రష్యాలో గ్యాజ్‌ప్రోమ్ నిర్వహిస్తున్న భారీ చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి జరిగింది. ఇంధన కొరతను అధిగమించేందుకు మార్చిలో పెట్రోల్‌లో మార్పులు చేసిన రష్యా, జులైలో దానిని పొడిగించింది. తాజాగా డిప్యుటీ పీఎం అలెగ్జాండర్ నొవాక్ ఈ నిషేధాన్ని మరోసారి విస్తరించారు. డీజిల్ ఎగుమతులపై కూడా కొంత నిషేధం విధించారు.
రష్యాలోని చాలా ప్రాంతాల్లో వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ పరిమితంగానే అందుబాటులో ఉన్నాయి. క్రిమియాలో సగం పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. అనేక చోట్ల వాహనాలు ఇంధనం కోసం క్యూలలో నిలుస్తున్నాయి. ప్రపంచంలో డీజిల్ అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా రష్యా ఉంది. ఆ దేశ ప్రభుత్వానికి ఇంధన ఎగుమతుల నుంచే అధిక ఆదాయం వస్తుంది.
