Khamenei’s Representative: చాబహార్ పోర్టు పురోగతిపై పూర్తి విశ్వాసం.. ఆంక్షలు భారత్‌ను ప్రభావితం చేయలేవు - ఖమేనీ ప్రతినిధి
ఆంక్షలు భారత్‌ను ప్రభావితం చేయలేవు - ఖమేనీ ప్రతినిధి

భారత్-ఇరాన్ సంబంధాలు మూడు వేల ఏళ్ల నాటివి.. మంచి బంధం కోరుకుంటున్నాం
Khamenei’s Representative: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భారత్‌లోని ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ మాట్లాడుతూ, భారత్-ఇరాన్ మధ్య సంబంధాలు వందల ఏళ్లు కాదు, మూడు వేల ఏళ్ల నాటివని తెలిపారు. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు, సహకారం ఉండాలని సుప్రీం లీడర్ ఎల్లప్పుడూ కోరుకుంటారని ఆయన పేర్కొన్నారు.
ఒక భారతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హకీమ్ ఇలాహీ మాట్లాడుతూ, ‘‘భారత్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్టు విషయంలో పూర్తి విశ్వాసం ఉంది. భారత్ అక్కడ బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం. ఇతర దేశాల ఆంక్షల వల్ల భారత్ ఎప్పుడూ ప్రభావితం కాలేదు’’ అని చెప్పారు.
ఇరు దేశాల మధ్య చారిత్రక బంధాలను గుర్తు చేస్తూ ఆయన, ‘‘పురాతన కాలంలోనే భారతీయ తాత్విక గ్రంథాలు ఇరాన్‌లో ఉపయోగించేవారు. ప్రస్తుతం మా విశ్వవిద్యాలయాల్లో గణితం, ఖగోళశాస్త్రం, వైద్య విద్య వంటి విషయాలు భారత్ నుంచి తీసుకుని చదువుతున్నాం. ఇరాన్‌పై ఆంక్షలు విధించడమే కాకుండా, అణు కేంద్రాలపై నిఘా పెట్టే అంతర్జాతీయ సంస్థలు కూడా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నాయి’’ అని విమర్శించారు.
చాబహార్ పోర్టు మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యానికి కీలకమైనది. ఈ పోర్టులో 10 ఏళ్ల పాటు టెర్మినల్ నిర్వహణకు భారత్-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టుకు మినహాయింపు ఇవ్వడంతో భారత్‌కు సౌకర్యం కలిగింది.
ఇటీవల ఇరాన్‌లో జరిగిన నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ నిర్ణయానికి ఇరాన్ రాయబారి మహ్మద్ ఫథాలీ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఫ్రాన్స్, మెక్సికో, దక్షిణ కొరియా వంటి 25 దేశాలు తీర్మానానికి మద్దతిచ్చగా, భారత్, చైనా సహా ఏడు దేశాలు వ్యతిరేకించాయి. 14 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
ఈ వ్యాఖ్యలు భారత్-ఇరాన్ మధ్య వాణిజ్య, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

