నేడు సార్వత్రిక ఎన్నికలు

బీఎన్‌పీ-జమాత్‌ కూటమి మధ్య తీవ్ర పోటీ.. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత మొదటి ఎన్నికలు

Bangladesh: షేక్‌ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిన ఏడాదిన్నర తర్వాత, బంగ్లాదేశ్‌లో తీవ్ర రాజకీయ అస్థిరత మధ్య గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళనలతో అవామీ లీగ్‌ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశ పాలనను చూసుకుంటోంది. ఇప్పుడు ఈ ఎన్నికల ద్వారా ఢాకాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

299 పార్లమెంటు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 1,981 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అవామీ లీగ్‌ పార్టీపై నిషేధం విధించడంతో, ఈసారి ప్రధాన పోటీ బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) మరియు షఫీకుర్‌ రెహమాన్‌ నేతృత్వంలోని జమాత్‌-ఎ-ఇస్లామీ కూటమి మధ్యే నెలకొంది. విద్యార్థుల ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన నేషనల్‌ సిటిజన్‌ పార్టీ కూడా జమాత్‌ కూటమిలో భాగమైంది. ఎన్నికలతో పాటు, కీలకమైన రాజ్యాంగ సంస్కరణలపై రిఫరెండం కూడా నిర్వహించనున్నారు.

హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ లేకుండా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. జమాత్‌-ఎ-ఇస్లామీ వంటి మతతత్వ పార్టీలు అధికారంలోకి వస్తే ఈ దాడులు మరింత తీవ్రమవుతాయని మైనారిటీలు ఆందోళన చెందుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story