Good News for H-1B Workers from Google: హెచ్-1బీ ఉద్యోగులకు గూగుల్ శుభవార్త.. 2026 నుంచి గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియ వేగవంతం!
2026 నుంచి గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియ వేగవంతం!

Good News for H-1B Workers from Google: అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్) కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం గూగుల్ మంచి వార్త అందించింది. 2026 నుంచి తమ కంపెనీలో పనిచేసే హెచ్-1బీ వీసా ఉద్యోగులకు గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు గూగుల్ తెలిపింది. ఇంటర్నల్ న్యూస్‌లెటర్ ద్వారా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు విదేశీ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
అర్హత కలిగిన ఉద్యోగులకు 2026 తొలి త్రైమాసికంలోనే PERM (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇమిగ్రేషన్ న్యాయవాదుల నుంచి సమాచారం అందుతుందని గూగుల్ మెమోలో పేర్కొంది. అయితే ఈ విషయంపై గూగుల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్రంప్ ప్రభుత్వం కఠిన వలస విధానాలు, పెరిగిన వీసా ఫీజులు, సోషల్ మీడియా తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయం చాలామంది హెచ్-1బీ ఉద్యోగులకు ఊరటనిచ్చేదిగా మారింది.
PERM ప్రక్రియ ఏమిటి?
అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం PERM మొదటి కీలక దశ. టెక్ కంపెనీలు ఈ ప్రక్రియ ద్వారానే విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాసం కల్పించేందుకు సహాయం చేస్తాయి. PERM ఆమోదం తర్వాతే గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ముందుకు సాగుతుంది. ఇందుకు కంపెనీ విదేశీ ఉద్యోగిని నియమించడం వల్ల అమెరికన్ కార్మికులపై ప్రతికూల ప్రభావం లేదని, ఆ పోస్ట్‌కు అర్హులైన అమెరికన్లు అందుబాటులో లేరని నిరూపించాలి.
లేఆఫ్‌లు ఎక్కువగా జరిగే సమయంలో ఈ ప్రక్రియను సమర్థించుకోవడం కంపెనీలకు కష్టమవుతుంది. 2023లో గూగుల్ 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన సమయంలో PERM ప్రక్రియను నిలిపివేసింది. అమెజాన్, మెటా వంటి కంపెనీలు కూడా అలాగే చేశాయి. గత ఏడాది గూగుల్ చాలా తక్కువ PERM దరఖాస్తులే సమర్పించింది. ఇప్పుడు 2026 నుంచి ఈ ప్రక్రియను మళ్లీ విస్తృతంగా ప్రారంభించనుంది.
అర్హత షరతులు ఏమిటి?
గూగుల్‌లో పనిచేసే అందరు విదేశీ ఉద్యోగులూ ఈ స్పాన్సర్‌షిప్‌కు అర్హులు కాదు. డిగ్రీతో పాటు పని అనుభవం, మంచి పనితీరు, సీనియారిటీ కీలకం. అత్యంత ముఖ్యంగా – ఆఫీసుకు వచ్చి పనిచేసే ఉద్యోగులకే ఈ అవకాశం వర్తిస్తుంది. రిమోట్‌గా పనిచేసేవారు అర్హత పొందాలంటే ఆఫీసు స్థలానికి మారాల్సిందే.
ఈ నిర్ణయంతో హెచ్-1బీ వీసా ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అమెరికాలోని టెక్ రంగంలో వలసదారులకు ఎదురవుతున్న అనిశ్చితుల నడుమ గూగుల్ ఈ అడుగు సానుకూల సంకేతంగా కనిపిస్తోంది.

