ప్రపంచానికి మరింతమంది ట్రంప్‌లు అవసరమంటూ స్టాండింగ్ ఓవేషన్

Grand Welcome for Trump in Israeli Parliament: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని సాధించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్ ప్రభుత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన కనేసేట్‌లో ట్రంప్‌కు స్టాండింగ్ ఓవేషన్ లభించింది. ప్రపంచానికి ట్రంప్ లాంటి నాయకులు మరింతమంది అవసరమని పార్లమెంట్ సభ్యులు ఆకాంక్షించారు. వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును ప్రతిపాదించనున్నట్లు ప్రకటించారు.

సోమవారం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న ట్రంప్, ప్రధాని నెతన్యాహుతో కలిసి జెరూసలెం పార్లమెంట్‌ను సందర్శించారు. అక్కడి సభ్యులు అమెరికా అధ్యక్షుడిని ఘనంగా స్వాగతించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ట్రంప్ చేసిన కృషిని మెచ్చుకుంటూ, రెండున్నర నిమిషాల పాటు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.

నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడు

పార్లమెంట్ స్పీకర్ అమిర్ ఒహనా మాట్లాడుతూ, బందీల విడుదలకు ట్రంప్ చేసిన ప్రయత్నాలను యూదు సమాజం శాశ్వతంగా గుర్తుంచుకుంటుందని ప్రశంసించారు. శాంతి కోసం ట్రంప్ లాంటి ధైర్యవంతులు, దృఢ సంకల్పం గల నాయకులు ప్రపంచానికి మరిన్ని కావాలని అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కంటే మెరుగైన అభ్యర్థి లేడని చెప్పారు. వచ్చే సంవత్సరం నోబెల్ పురస్కారానికి అన్ని దేశాలు ట్రంప్ పేరును సిఫారసు చేసేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ప్రపంచాన్ని మార్చిన ట్రంప్ ధైర్యం

తర్వాత నెతన్యాహు ప్రసంగిస్తూ ట్రంప్‌ను అభినందించారు. ట్రంప్ లాంటి వేగవంతమైన, దృఢమైన నాయకుడిని ఇంతవరకు చూడలేదని కొనియాడారు. గాజా యుద్ధాన్ని ముగించేలా ఒప్పందాన్ని సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని చెప్పారు. ట్రంప్ తప్పకుండా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

బంగారు పావురం బహుకరణ

అంతకుముందు ట్రంప్, నెతన్యాహు భేటీలో ఇజ్రాయెల్ ప్రధాని అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేక బహుమతి అందజేశారు. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ చేస్తున్న కృషిని గుర్తుచేస్తూ బంగారు పావురాన్ని కానుకగా ఇచ్చారు.

కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం సోమవారం హమాస్ తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను స్వేచ్ఛగా విడిచిపెట్టింది. రెండో దశ చర్చల కోసం ఈజిప్టులో సమావేశాలు జరగనున్నాయి. నెతన్యాహు ముందస్తు కార్యక్రమాల కారణంగా హాజరుకాకపోయినా, ట్రంప్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story