Trump Issues Strong Warning to Venezuela’s Interim President Delcy: అమెరికా ఆదేశాలు పాటించకపోతే మదురో కంటే దారుణ శిక్ష.. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీకి ట్రంప్ గట్టి హెచ్చరిక
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీకి ట్రంప్ గట్టి హెచ్చరిక

Trump Issues Strong Warning to Venezuela’s Interim President Delcy: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న తరువాత, ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా మాట వినకపోతే మదురో కంటే ఘోరమైన పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మదురో నిర్బంధం తరువాత వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మొదట్లో అమెరికా చర్యలకు సహకరించే అవకాశం ఉందని ట్రంప్ భావించారు. కానీ డెల్సీ మదురో విడుదలకు డిమాండ్ చేస్తూ అమెరికా చర్యలను తీవ్రంగా విమర్శించడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మేం ఈ విషయాన్ని సహించబోం. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. వెనిజులా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా మేం చేయాలనుకున్న పనులకు ఆమె అడ్డురాకూడదు. అమెరికా నియంత్రణను అంగీకరిస్తేనే ఆ దేశాన్ని పునర్నిర్మాణం చేయగలం. ఆమె మా మాట విన్నట్లయితే వెనిజులాలో అమెరికా సైనిక బలగాలు మోహరించబోం’’ అని ట్రంప్ హెచ్చరించారు.
డెల్సీ స్పందన – సహకార ఆహ్వానం
మరోవైపు డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికాతో సహకరించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ.. ‘‘మా దేశం శాంతి, సార్వభౌమత్వం కోసం కట్టుబడి ఉంది. బయటి బెదిరింపులు లేకుండా అంతర్జాతీయ సహకారంతో గౌరవప్రదంగా జీవించాలని మేం కోరుకుంటున్నాం. ప్రపంచ శాంతి కోసం ప్రతి దేశంలో స్థిరత్వం అవసరం. అమెరికాతో సహా అన్ని దేశాలతో సమాన స్థాయి సంబంధాలు ఏర్పరచుకోవడానికి మేం సిద్ధం. వెనిజులా ప్రగతి కోసం అమెరికాను కలిసి పనిచేయమని ఆహ్వానిస్తున్నాం’’ అని ఆమె తెలిపారు.
వెనిజులా పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఉద్రిక్తంగా ఉంది. అమెరికా చర్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

