'Highway of Death' in Russia: రష్యాలో ‘హైవే ఆఫ్ డెత్’.. డ్రోన్ దాడులతో ఉక్రెయిన్ వ్యూహాత్మక దెబ్బ
ఉక్రెయిన్ వ్యూహాత్మక దెబ్బ

'Highway of Death' in Russia: ఉక్రెయిన్ సైన్యం రష్యా రాజధాని మాస్కోపై వరుస డ్రోన్ దాడులతో ఒత్తిడి పెంచుతోంది. యుద్ధాన్ని రష్యా గుండెలపైకి తీసుకొచ్చినట్లు పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఆక్రమిత క్రిమియాకు రష్యా ప్రధాన భూభాగం నుంచి సరకులు, ఇంధనం చేరకుండా ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ద్వారా కట్టడి చేస్తోంది. దీంతో రష్యాకు యుద్ధం భారీగా తాకుతోంది. ప్రపంచంలో అత్యధిక చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో టాప్-3లో ఉన్న రష్యా ఇప్పుడు దేశీయంగా ఇంధన కొరతను ఎదుర్కొంటోంది.
‘ప్రతీకార దేవత’ నీడలో హైవే..
రష్యా ప్రధాన భూభాగంలోని రోస్టవ్ ఆన్ డాన్ నుంచి ఆక్రమిత మారియపోల్, మెలిటోపోల్ మీదుగా క్రిమియాకు వెళ్లే ప్రధాన మార్గం ఆర్-280 హైవే. ఈ రోడ్డు ద్వారా సైనిక దళాలు, ఇంధనం, సరకులు రష్యా ఆక్రమిత ప్రాంతాలకు చేరేవి. కెర్చి వంతెనపై దాడులు పెరగడంతో దీనిని ప్రత్యామ్నాయంగా క్రెమ్లిన్ ఎంచుకుంది.
అయితే, ఉక్రెయిన్ సైన్యంలోని 412వ నెమిసోవ్ బ్రిగేడ్ (గ్రీకు భాషలో ‘ప్రతీకార దేవత’ అర్థం) అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ ఫోర్స్ ఈ వ్యూహాన్ని గ్రహించి భారీ డ్రోన్ దాడులు చేసింది. అమెరికా తయారీ హార్నెట్, స్థానికంగా తయారైన మోరిగన్ డ్రోన్లు ఉపయోగించి ఈ మార్గంపై దాడులు చేయడంతో ట్రాఫిక్ 70% పైగా తగ్గిపోయింది. ట్యాంకర్లు, సైనిక వాహనాలు ఈ హైవేను ఉపయోగించడానికి భయపడుతున్నాయి. దీంతో ఈ మార్గం ‘హైవే ఆఫ్ డెత్’గా మారింది.
ఇక ఎఫ్‌పీ-2, బెహెమోత్ డ్రోన్లు కూడా ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది. ఇవి 50-300 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలవు. వీటి వల్ల మిడ్ రేంజ్ దాడులు గతేడాది 28 రెట్లు పెరిగాయని అంచనా. లాజిస్టిక్స్‌తో పాటు రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా ఇవి దెబ్బతీస్తున్నాయి.
చమురు క్షేత్రాలు, రిఫైనరీలపై దాడులు
యుద్ధం మొదలైన 2022 ఫిబ్రవరి నుంచి 2026 ఏప్రిల్ వరకు ఉక్రెయిన్ దళాలు రష్యా ఇంధన రిఫైనరీలపై 158 దాడులు చేశాయి. రష్యాలోని అతి పెద్ద 33 రిఫైనరీల్లో కనీసం 24పై దాడులు జరిగాయి. ర్యాజన్, సరటోవ్ రిఫైనరీలపై దాదాపు 15 చొప్పున దాడులు జరిగాయి. సిజ్రాన్‌పై మే చివరి వరకు 11 సార్లు దాడి జరిగింది.
ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 16 చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతిన్నాయి. రోజుకు 7 లక్షల బ్యారెళ్ల రిఫైనింగ్ సామర్థ్యం తగ్గిపోయింది. రష్యా చమురు శుద్ధి సామర్థ్యం 2009 తర్వాత అతి తక్కువకు చేరింది. ముడి చమురు ఉత్పత్తి కూడా రోజుకు 4.6 లక్షల బ్యారెళ్లు తగ్గిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది.
లాజిస్టిక్స్ లాక్‌డౌన్ వ్యూహం
యుద్ధంలో విజయం సాధించాలంటే ఇంధనం, మందుగుండు, ఆహారం, సరఫరా మార్గాలు కీలకం. వీటిని కట్ చేస్తే ఏ సైన్యమైనా కొన్ని వారాల్లో చేతులెత్తేస్తుంది. ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా విషయంలో లాజిస్టిక్స్ లాక్‌డౌన్ ప్లాన్ అమలు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
నేరుగా రష్యా దళాలపై దాడులు తగ్గించి, సరఫరా మార్గాలపై దృష్టి పెట్టింది. దేశీయంగా తయారైన మధ్య శ్రేణి డ్రోన్లతో రష్యా లోపలి ప్రాంతాల్లో ఇంధన కాన్వాయ్‌లు, మిలిటరీ ట్రక్కులు, రైళ్లపై దాడులు చేస్తోంది. క్రిమియాకు సరఫరాలను తెంపేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి కనీసం 20 ఇంధన రైళ్లను ధ్వంసం చేసినట్లు అమెరికా విశ్లేషకులు రికార్డు చేశారు.
రష్యా యుద్ధంలో విజయాలు సాధిస్తున్నట్లు చెబుతున్నా, ఈ డ్రోన్ దాడుల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ వ్యూహం రష్యా లాజిస్టిక్స్‌ను భారీగా దెబ్బతీస్తోంది.

