Canada: కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆమోదం: విద్వేష చర్యలను అరికట్టే కీలక బిల్లు.. ధార్మిక స్వేచ్ఛపై తీవ్ర చర్చలు!
ధార్మిక స్వేచ్ఛపై తీవ్ర చర్చలు!

Canada: కెనడాలో విద్వేషపూరిత చర్యలు, హేట్ క్రైమ్స్‌ను కట్టడి చేసేందుకు తీసుకువచ్చిన ‘కాంబాటింగ్ హేట్’ (C-9 బిల్లు)కు హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదం తెలిపింది. ఈ కీలక చట్టానికి లోయర్ హౌస్ ముద్ర వేయగా, ఇప్పుడు ఎగువ సభ (సెనెట్)కు పంపించారు. విద్వేష చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించడం, ప్రార్థనా స్థలాలపై దాడులు, నిషేధిత సంస్థల చిహ్నాలతో సంబంధం ఉన్న చర్యలను తీవ్ర నేరంగా పరిగణించేలా ఈ బిల్లు రూపొందించబడింది. ఇది అమల్లోకి వచ్చే సమయానికి ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలకు పెద్ద చెక్ పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ బిల్లు కోసం కెనడాలోని భారత సంతతి వ్యక్తులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో కెనడాలో ఖలిస్థానీల ఆగడాలు భారీగా పెరిగిపోయాయి. కొన్ని సంఘాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, విధ్వంసాలు, హింసాత్మక చర్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రవాస భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే విద్వేష చర్యలను కట్టడి చేసే ఈ కొత్త చట్టం ఆమోదం పొందడం వారికి ఊరట కలిగించే విషయమైంది.
బిల్లు ప్రకారం నిషేధిత సంస్థల చిహ్నాలను బహిరంగంగా చూపడం, ఏ వర్గాన్నైనా లక్ష్యంగా చేసుకుని విద్వేషాన్ని రెచ్చగొట్టడం తీవ్ర నేరంగా పరిగణించబడతాయి. యూదులు, ముస్లింలు, ఇతర మతాల వారిని వారి ప్రార్థనా స్థలాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం కూడా ఈ చట్టం కింద నేరంగా మారనుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
అయితే, ఈ బిల్లు ధార్మిక స్వేచ్ఛను పరిమితం చేస్తుందని చెప్పి కన్జర్వేటివ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీని వల్ల బిటర్ డిబేట్ జరిగింది. ఈ చట్టం అమల్లోకి వస్తే కెనడాలో హింస, విద్వేషాలకు గట్టి అడ్డుకట్ట పడుతుందని భారత సంతతి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

