Donald Trump: నేను పూర్తి ఆరోగ్యవంతుడిని: ట్రంప్
ఆరోగ్యవంతుడిని: ట్రంప్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆరోగ్యం అత్యుత్తమంగా ఉందని, తాను బలంగా, శక్తివంతంగా ఉన్నానని ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. గతేడాది అక్టోబర్‌లో వాల్టర్ రీడ్ జాతీయ సైనిక వైద్య కేంద్రాన్ని సందర్శించి గుండెకు సంబంధించిన సీటీ స్కాన్ పరీక్ష చేయించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ పరీక్ష తన ఆరోగ్యంపై ప్రజల్లో అనవసర అనుమానాలు రేకెత్తించిందని, అది తనకు పొరపాటైందని ట్రంప్ అన్నారు.
ఇటీవల ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు ఆయన ఆరోగ్య వివరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వృద్ధాప్యంలో ఆరోగ్య నిరోధక చర్యల్లో భాగంగా ఇమేజింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్టు వైద్యుడు తెలిపారు. ముందుగా ట్రంప్ ఎంఆర్‌ఐ స్కాన్ చేయించుకున్నట్టు ప్రకటించారు కానీ, ఏ భాగానికి ఆ పరీక్ష జరిపారో స్పష్టం చేయలేదు. తాజాగా ఆయన వ్యక్తిగత వైద్యుడు, నేవీ కెప్టెన్ సీన్ బార్బడెల్లా వెల్లడించిన వివరాల ప్రకారం... గుండె సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి సీటీ స్కాన్ లేదా ఎంఆర్‌ఐ పరీక్ష సలహా ఇచ్చానని, ఆ పరీక్షల్లో ట్రంప్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ కనిపించలేదని ధృవీకరించారు.
ఈ ప్రకటనతో ట్రంప్ ఆరోగ్యంపై ఉన్న చర్చలకు తెరపడినట్టయింది. అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడానికి తాను పూర్తి సామర్థ్యంతో ఉన్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

