Sheikh Hasina: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లి కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ, స్వదేశ గడ్డపైనే మరణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా ఈ విషయాలు వెల్లడించారు.

హసీనా మాట్లాడుతూ, ‘‘స్వదేశానికి వెళ్లిన తర్వాత వాళ్లు నన్ను అరెస్టు చేయొచ్చు లేదా చంపేసే అవకాశమూ ఉంది. అయినా నేను వెళ్లాలి. నా పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. మరణం సంభవిస్తే.. నా తల్లిదండ్రులను ఖననం చేసిన చోట, నా సొంత గడ్డపైనే చనిపోవాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

ఈ డిసెంబర్‌లో తనతో పాటు అవామీ లీగ్‌ పార్టీ సీనియర్‌ నేతలు కూడా స్వదేశానికి వెళ్లి కోర్టుల్లో లొంగిపోవాలని నిర్ణయించినట్లు హసీనా చెప్పారు. తన అప్పగింతపై భారత్‌కు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అనేక లేఖలు రాస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, బంగ్లాదేశ్‌ ప్రస్తుత ప్రభుత్వంతో ఈ విషయంపై ఎలాంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు.

గతం గుర్తు చేస్తూ.. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో 2024 ఆగస్టు 5న దేశం విడిచి భారత్‌కు వచ్చిన షేక్‌ హసీనా ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. నిరసనలను అణచివేయడంలో ఆమె పాత్ర ఉందంటూ ఆమెపై అనేక కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ 2025లో ఆమెకు మరణశిక్ష విధించింది. హసీనా ఈ కేసులను తోసిపుచ్చారు.

ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడు స్వదేశం వెళ్లేందుకు సిద్ధమని చెప్పిన హసీనా, ఇప్పుడు డిసెంబర్‌ను నిర్దిష్ట సమయంగా ప్రకటించారు. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం భారత్‌ను పదేపదే కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story