US Senator Steve Daines: అమెరికాకు భారత్‌ విశ్వసనీయ మిత్రదేశమని రిపబ్లికన్‌ సెనెటర్‌ స్టీవ్ డైన్స్ స్పష్టంగా తెలిపారు. భారత్‌-చైనా మధ్య భద్రతా వ్యత్యాసాన్ని తన వ్యక్తిగత ఉదాహరణతో వివరించారు. చైనా పర్యటనకు వెళ్లేటప్పుడు తన ఫోన్‌ను వాషింగ్టన్‌లోని డెస్క్‌పైనే వదిలేసి వెళ్తానని, భారత్‌కు వెళ్లేటప్పుడు మాత్రం ఫోన్‌ తనతోపాటు తీసుకెళ్తానని చెప్పారు.

యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ సెనెటర్ డైన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. “చైనాకు వెళ్లేటప్పుడు ఈ ఫోన్ బీజింగ్‌తో నాతో వెళ్లదు. అది వాషింగ్టన్ డీసీలో నా డెస్క్‌పైనే ఉంటుంది. కానీ ఢిల్లీ లేదా భారత్‌లో ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఈ ఫోన్ నాతో ఉంటుంది. ఇది అత్యంత విశ్వసనీయ మిత్రదేశం, స్నేహితుడికి చిన్న ఉదాహరణ మాత్రమే” అని ఆయన అన్నారు.

భారత్‌తో అమెరికా సంబంధాలు ఇరు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కూడా ఉపయోగకరమని సెనెటర్ డైన్స్ వ్యాఖ్యానించారు. బీజింగ్‌తో పూర్తి సంబంధాలు తెంచుకోకుండా, నష్టాలను తగ్గించుకుని సంబంధాలు కొనసాగించాలని కూడా సూచించారు. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కాబోతోందని, ఇది ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు.

ఈ వ్యాఖ్యలు అమెరికా-చైనా మధ్య విశ్వాస లోపం, అమెరికా-భారత్ మధ్య బలమైన సంబంధాలను స్పష్టంగా హైలైట్ చేస్తున్నాయి. సెనెటర్ డైన్స్ భారత్‌ను “హైలీ ట్రస్టెడ్ అల్లీ అండ్ ఫ్రెండ్”గా వర్ణించడం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని సంకేతాలిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story