అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరిక

వన్‌ బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లును చట్టంగా చేసిన విజయోత్సాహంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా బ్రిక్స్‌ దేశాలపై విరుచుకుపడ్డారు. ఓ పక్కన బ్రెజిల్‌ రాజధాని రియో డి జనీరోలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌ దేశాలతో ఉన్న దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్‌ విధిస్తానని ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. బ్రిక్స్‌ విధానాలు అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అందువల్ల బ్రిక్ష్‌ దేశాలతో మిలాకాత్‌ అయితే పది శాతం అదనపు సుంకం తప్పదని ట్రంప్‌ స్పష్టం చేశారు. అదనపు సుంకం విధింపులో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండవని ట్రంప్‌ తేల్చి చెప్పారు. తాజాగా రియో డి జనీరో లో సమావేశమైన బ్రిక్స్‌ దేశాలు ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు చేస్తున్న దాడులను ఖండించాయి. యద్దం నేపథ్యంలో అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలపై బ్రిక్స్‌ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అలాగే యూఎస్‌ ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ పేరును ప్రస్తావించకుండానే ఆగ్రరాజ్యం ప్రతీకార సుంకాలు, బెదిరింపులను తీవ్రంగా ఖండిస్తూ డిక్లరేషన్‌ ను విడుదల చేశాయి. ఏకపక్ష టారిఫ్‌ విధానాలను బ్రిక్స్‌ నేతలు ఈ డిక్లరేషన్‌ లో ఖండించారు. అమెరికా విధిస్తున్న సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని డిక్లరేషన్‌ లో పేర్కొన్నారు. సుంకాల విషయంలో తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రపంచ వాణజ్య స్ధిరత్వాన్ని దెబ్బతీస్తాయని ఎత్తి చూపారు. అయితే ట్రంప్‌ ఇప్పటికే 12 దేశాలకు టారిఫ్‌ నోటీసులు పంపారు. కానీ అమెరికా టారిఫ్‌ లపై 90 రోజుల మినహాయింపు గడువు జూలై 9తో ముగుస్తుంది. దీంతో ఆ రోజు నుంచి అమెరికా నూతన టారిఫ్‌ లు అమలులోకి వస్తాయిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మినాహింపు ఇచ్చిన రోజే ప్రకటించారు. అయినప్పటికీ ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన టారిఫ్‌ లు అమలులోకి వస్తాయని అమెరికా కామర్స్‌ మంత్రి హోవార్డ్‌ లూట్నిక్‌ వెల్లడించారు. 2009లో బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా దేశాలు కలిపి బ్రిక్స్‌ దేశాలుగా ఏర్పడ్డాయి. అనంతర కాలంలో ఈ బ్రిక్స్‌ దేశాల సరసన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇండోనేషియా, ఇరాన్‌, ఈజిప్ట్‌, ఇథియోపియా, నైజీరియా దేశాలు కూడా చేరడంతో ఇప్పుడు బ్రిక్స్‌ లో మొత్తం 11 దేశాలు ఉన్నాయి. ఈ యూనియన్‌ లో సౌదీ అరేబియాను కూడా ఆహ్వానించారు. అలాగే అజర్‌ బైజాన్‌, మలేషియా, టర్కీ దేశాలు కూడా బ్రిక్స్‌ లో చేరడానికి ఆసక్తి చూపించి సభ్యత్వం కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఈ దేశాలే కాక ఇంకా అనేక దేశాలు ఈ బ్రిక్స్‌ లో చేరడానికి ఆస్తక్తి చూపిస్తుండటంతో బ్రిక్స్‌ తో కలిసే దేశాలపై పది శాతం అదనపు టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు దిగుతున్నారు.

Updated On 7 July 2025 11:57 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story