స్టీవ్ బానన్ పిలుపు

Steve Bannon Calls: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్... అమెరికాలో వలసలను పదేళ్ల పాటు పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇమిగ్రేషన్ వ్యవస్థలో అవినీతి భారీ స్థాయిలో పేరుకుపోయిందని, శరణార్థి కార్యక్రమాలు, ఆశ్రయ కల్పన, క్షమాభిక్ష పథకాలు అన్నీ అవినీతితో నిండిపోయాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. తన పాడ్‌కాస్ట్ ‘వార్ రూమ్’ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికన్ యువతకు రావాల్సిన ఉద్యోగాలను తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికులకు ఇస్తున్నారని హెచ్-1బీ వీసా కార్యక్రమంపై బానన్ మండిపడ్డారు. ఈ వీసా పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని, అలాగే ఇతర వలస కార్యక్రమాలన్నింటిపైనా పదేళ్ల మారటోరియం (నిషేధం) విధించాలని సూచించారు. ఈ వ్యవస్థను రూట్ లెవెల్ నుంచి సరిచేయాలంటే ఇంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రంప్ ప్రభుత్వం వలసలపై ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. శరణార్థులు, వలసదారులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల కాలపరిమితిని తగ్గించడం, హెచ్-1బీ వీసా దరఖాస్తుల అపాయింట్‌మెంట్లను వాయిదా వేయడం, వీసా ఫీజును భారీగా పెంచడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో బానన్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అమెరికాలో వలస విధానాలపై జోరుగా చర్చ జరుగుతున్న తరుణంలో బానన్ ఈ పిలుపు ఇవ్వడం గమనార్హం. ఈ వ్యవస్థలోని అవకతవకలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు రాడికల్ చర్యలు అవసరమని ఆయన నొక్కి చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story