White House: అమెరికా సుంకాలను తప్పించుకోవడానికి చైనా తయారీ వస్తువులను ఇతర దేశాల ద్వారా రీరూట్ చేస్తోందని, ఈ ‘షాడో ట్రాన్స్‌షిప్‌మెంట్ నెట్‌వర్క్’లో భారత్‌తో పాటు 40కు పైగా దేశాలు పాల్గొంటున్నాయని అమెరికా ఆరోపించింది. ‘ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్’ పేరిట విడుదలైన నివేదికలో ఈ ఆరోపణలు ఉన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఈ నివేదికను విడుదల చేశారు.

2018లో చైనాపై సెక్షన్ 301 కింద అమెరికా సుంకాలు విధించిన తర్వాత ఈ అక్రమ రవాణా పెరిగిందని నివేదిక పేర్కొంది. చైనా వస్తువులను రీలేబులింగ్, రీప్యాకేజింగ్ చేసి, రవాణా మార్గాలను మార్చి తక్కువ సుంకాలు ఉన్న దేశాల ద్వారా అమెరికాకు పంపిస్తున్నారని వివరించింది. దీని విలువ సంవత్సరానికి 40 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. కేంద్ర అంచనా ప్రకారం సంవత్సరానికి సుమారు 75 బిలియన్ డాలర్లు అక్రమ ట్రాన్స్‌షిప్‌మెంట్ జరుగుతోంది.

మెక్సికో, భారత్, వియత్నాం వంటి దేశాలు ప్రధాన హబ్‌లుగా ఉన్నాయని నివేదిక సూచించింది. 2025లో ఈ మూడు దేశాల ద్వారా సుమారు 67 బిలియన్ డాలర్ల విలువైన చైనా సరకులు అమెరికాకు చేరాయని, దీనివల్ల అమెరికా ప్రభుత్వానికి సుమారు 28 బిలియన్ డాలర్ల సుంకాల రాబడి నష్టం వాటిల్లిందని పేర్కొంది. భారత్‌ను ‘టైర్-1 డైవర్సిఫైడ్ స్కేల్ లీడర్’గా వర్గీకరించారు. పూణే-గుజరాత్-చెన్నై కారిడార్ ద్వారా పంపులు, కంప్రెసర్లు వంటి వస్తువులు రీరూట్ అవుతున్నాయని, దీనివల్ల అమెరికాలోని సిన్సినాటి, డేటన్, కొలంబస్ వంటి ప్రాంతాల తయారీదారులకు నష్టం జరుగుతోందని నివేదికలో ప్రస్తావించారు.

ఈ అక్రమ రవాణాను గుర్తించేందుకు అమెరికా ‘డిటెక్టివ్ బోర్డర్’ పేరిట ఒక ఏఐ టూల్‌ను అభివృద్ధి చేయనుంది. షిప్‌మెంట్ రికార్డులు, రూటింగ్ హిస్టరీ, ఓనర్‌షిప్ లింకులు వంటి వాటిని పరిశీలించి వాస్తవ మూలాన్ని గుర్తించనుందని తెలిపింది. ఈ నివేదిక విడుదలైన నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే వస్తువులపై అమెరికా కఠిన తనిఖీలు పెంచే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story