PM Modi: భారత్ ప్రపంచ వృద్ధికి లాంచ్‌ప్యాడ్: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

PM Modi: భారతదేశం అంతర్జాతీయ పెట్టుబడులకు కేవలం గమ్యస్థానం మాత్రమే కాదని, ప్రపంచ ఉత్పత్తులకు మార్కెట్‌గా మాత్రమే కాకుండా, ప్రపంచ వృద్ధికి ఒక ప్రయోగవేదిక (లాంచ్‌ప్యాడ్) అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
న్యూజిలాండ్‌లో జరిగిన భారత్-న్యూజిలాండ్ వ్యాపార, క్రీడా భాగస్వామ్య కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) సాంకేతికత, సేవలు, రాకపోకలు, పెట్టుబడులు వంటి అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు.
ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 15 ఏళ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని న్యూజిలాండ్ ముందుకు వచ్చింది. ఇది సాధారణ పెట్టుబడి మాత్రమే కాదని, భారత్ వృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం కావాలనే న్యూజిలాండ్ నిబద్ధతకు నిదర్శనమని ప్రధాని మోదీ అభివర్ణించారు.
ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్‌తో జరిగిన చర్చల్లో వాణిజ్యం, సాంకేతికత, వ్యవసాయం, డైరీ, ఆరోగ్యం, సాంప్రదాయ వైద్యం, రక్షణ, భద్రత వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రక్షణ, విపత్తు నిర్వహణ, పర్యాటకం, క్రీడలు, పశుసంవర్ధకం వంటి రంగాల్లో అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

