Dollar Pressure: డాలర్ దెబ్బకు భారత్ దిశమార్చింది.. పసిడిపైనే నమ్మకం!
పసిడిపైనే నమ్మకం!

Dollar Pressure: పరాయి సొమ్ము పాము వంటిదని అంటారు.. కానీ, మన సొమ్ము పరాయి వాళ్ల వద్ద ఉంటే అది అనకొండలాంటిది. ఎప్పుడో మన భవిష్యత్తును మింగేస్తుంది. ఈ పాఠం రష్యాకు బాగా తెలుసు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా, పశ్చిమ దేశాలు రష్యా వద్ద ఉన్న 300 బిలియన్ డాలర్ల రిజర్వులను స్తంభింపజేశాయి.
ఈ నేపథ్యంలో భారత్ కొన్నాళ్లుగా డాలర్లపై ఆధారపడకుండా బంగారం కొనుగోళ్లను భారీగా పెంచింది. ఈ ధోరణి ట్రంప్ టారిఫ్‌లు విధించకముందే ప్రారంభమైంది. డాలర్లలో మాత్రమే రిజర్వులను ఉంచడం సురక్షితం కాదని భారత్ గుర్తించింది.
అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం, భారత్ యొక్క ట్రెజరీ సెక్యూరిటీల పెట్టుబడులు జూన్‌లో 227.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇది మే నెలలో 235.3 బిలియన్ డాలర్లుగా, గత ఏడాది ఇదే సమయంలో 242 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. రిజర్వులను ఒకే రూపంలో కాకుండా వివిధ రూపాల్లో ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించిందని, గత వారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ వద్ద 694 బిలియన్ డాలర్ల రిజర్వులు ఉన్నాయి, ఇది ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రిజర్వ్.
ప్రపంచ దేశాలు బంగారం వైపు..
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల మధ్య, జూన్‌లో ఇతర దేశాలు ట్రెజరీ సెక్యూరిటీల్లో పెట్టుబడులను పెంచాయి. అయితే, డాలర్ రిస్క్‌ను తగ్గించేందుకు బంగారం కొనుగోళ్లను కూడా పెంచాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేంద్ర బ్యాంకుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా, 2022లో ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యా రిజర్వులను అమెరికా స్తంభింపజేసిన నిర్ణయం ఇందులో కీలక పాత్ర పోషించింది. రష్యాకు ఉన్న 330 బిలియన్ డాలర్ల వరకు రిజర్వులను అమెరికా ఫ్రీజ్ చేసిందని ఇండస్‌ఇండ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ గౌరవ్ కపూర్ తెలిపారు. రష్యా వంటి పెద్ద దేశ రిజర్వులను స్తంభింపజేసిన అమెరికా, ఇతర దేశాలకు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవచ్చనే భయం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులను డాలర్ నిల్వలను తగ్గించేలా ప్రేరేపించింది.
ట్రంప్ టారిఫ్‌లతో ఉద్రిక్తతలు..
ఆగస్టులో భారత్-అమెరికా మధ్య సంబంధాలు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. దీంతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులపై ట్రంప్ పరిపాలన 50 శాతం టారిఫ్‌లను విధించింది, ఇది ఆసియాలో అత్యధికం. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, భారత్, చైనాలను ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు అందిస్తున్న 'చెడు దేశాలు'గా వ్యాఖ్యానించారు. ట్రంప్ వాణిజ్య సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ మరింత ముందుకెళ్లి, భారత్ ట్రంప్‌కు క్షమాపణలు చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటుందని, అమెరికా లేకుండా భారత్ ముందుకు సాగలేదని వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సలహాదారు పీటర్ నవారో భారత్ డాలర్లతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, డాలర్ వినియోగంపై ఆంక్షలు విధిస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అమెరికా భారత్ యొక్క ఔట్‌సోర్సింగ్, సాఫ్ట్‌వేర్ రంగాలను లక్ష్యంగా చేస్తామని పదేపదే ప్రకటనలు చేస్తోంది, ఇది భారత్‌కు ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.
బంగారం నిల్వల్లో భారీ పెరుగుదల..
ఆర్బీఐ గణాంకాల ప్రకారం, గతేడాది 841.5 టన్నులుగా ఉన్న బంగారం నిల్వలు ఇప్పుడు 880 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. విదేశాల్లో ఉన్న బంగారం నిల్వలను స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియను కూడా ఆర్బీఐ వేగవంతం చేసింది. 2020లో 292 టన్నులుగా ఉన్న ఈ నిల్వలు ఇప్పుడు 512 టన్నులకు చేరాయి. గత ధన్‌తేరస్ సమయంలో 102 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు, ఈ తరలింపు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. ప్రస్తుతం బ్యా�ంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద 300 టన్నులకు పైగా బంగారం ఉంది, ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం రిజర్వు కేంద్రం. అవసరమైనప్పుడు వేగంగా నగదుగా మార్చేందుకు ఈ నిల్వలను లండన్ బులియన్ మార్కెట్‌లో ఉంచారు.
ఇటీవల ఆర్బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ మైఖెల్ పాత్రా ఓ వ్యాసంలో, విదేశాల్లో ఉంచిన బంగారం రిజర్వులను సంక్షోభ సమయంలో లేదా ఆంక్షలు, స్తంభన, జప్తు సందర్భాల్లో దక్కించుకోవడం కష్టమని హెచ్చరించారు. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, ఆస్తులను వివిధ రూపాల్లో విస్తరించాలని సూచించారు. శక్తికాంత దాస్ గవర్నర్‌గా ఉన్న సమయంలో బంగారం కొనుగోళ్ల నిర్ణయంలో పాత్రా కీలక పాత్ర పోషించారు.
