Indian Student Visas: భారతీయ విద్యార్థి వీసాలు: ట్రంప్ ఇమిగ్రేషన్ విధానం.. ఆగస్టులో భారీ క్షీణత
ట్రంప్ ఇమిగ్రేషన్ విధానం.. ఆగస్టులో భారీ క్షీణత

Indian Student Visas: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నుంచి వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్ డిపోర్టేషన్లు, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలు విధించడం వంటి నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వలసవాదులను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఆ దేశంలో ఉన్నత విద్యావకాశాల కోసం ఆశలు పెట్టుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఆగస్టు నెలలో అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల వీసాలు భారీగా పడిపోయాయని అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ (ఐటిసి) తాజా డేటా వెల్లడించింది.
ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు వల్ల ఆగస్టులో విదేశీ విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్య 19 శాతం మేర తగ్గింది. గతేటి ఆగస్టుతో పోల్చితే ఇది కరోనా మహమ్మారి తర్వాత రికార్డు స్థాయి క్షీణత. సాధారణంగా అమెరికా విశ్వవిద్యాలయాలు కార్యారంభం చేసే ఈ నెలలో మొత్తం 3,13,138 విద్యార్థి వీసాలు (ఎఫ్-1, ఎం-1) జారీ చేసింది. అయితే, భారతీయ విద్యార్థుల వీసాలు 44 శాతం తగ్గాయి. మునుపటి సంవత్సరాల్లో అమెరికాకు విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులలో భారత్ మొదటి స్థానంలో ఉండగా, ఈసారి ఆ స్థితి మారిపోయింది.
పోలిక కోసం చూస్తే, ఈ నెలలో చైనా విద్యార్థులకు అమెరికా 86,647 వీసాలు మంజూరు చేసింది. ఇది భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే దాదాపు రెట్టింపు. ఈ పరిణామాలు ట్రంప్ పాలసీల ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో అమెరికా రాయబారీ కార్యాలయాల్లో కొత్త విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా ఆపేసిన సంగతి తెలిసింది. ‘సోషల్ మీడియా వెట్టింగ్’ అనే కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఈ చర్య తీసుకున్నారు. దరఖాస్తుదారుల ఆన్‌లైన్ యాక్టివిటీ, సోషల్ మీడియా ప్రొఫైళ్లను తనిఖీ చేసి, భద్రతా ముప్పును అంచనా వేస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పరిశీలన తర్వాతే వీసాలు మంజూరు చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూలు పునఃప్రారంభించారు కానీ, ఈ ఆలస్యం దరఖాస్తులపై ప్రభావం చూపింది.
ఇక హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుములను భారీగా పెంచిన ట్రంప్ నిర్ణయం కూడా భారతీయ విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ అన్ని పరిణామాలు కలిసి అమెరికాలో చదువుకోవాలనే భారతీయుల ఆశలను దెబ్బతీస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ధోరణి కొనసాగితే, భారతీయ విద్యార్థుల అమెరికా ప్రయాణాలు మరింత కష్టమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
