ఐరాసకు అత్యంత ముఖ్యం: గుటెరెస్

Guterres: అంతర్జాతీయ సమాజ శ్రేయస్సు కోసం భారత్ శాశ్వతంగా అందిస్తున్న సహకారం ఐక్యరాజ్యసమితి (ఐరాస)కు అత్యంత కీలకమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు కీలక పాత్ర పోషిస్తున్న సానుకూల ధోరణి ఇప్పుడు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

దక్షిణార్ధ గోళ దేశాల్లో తొలిసారిగా భారత్ నిర్వహిస్తున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026’లో పాల్గొనేందుకు న్యూయార్క్ నుంచి బయలుదేరే ముందు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుటెరెస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐరాస నిర్వహిస్తున్న శాంతి పరిరక్షణ మిషన్లలో అత్యధికంగా 5 వేల మంది భారత భద్రతా సిబ్బంది పనిచేస్తున్నారని, దీనికి ఐరాస భారత్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. 2007లో లైబీరియాలో శాంతి పరిరక్షణ మిషన్ కోసం పూర్తిగా మహిళలతో కూడిన తొలి పోలీస్ యూనిట్‌ను భారత్ అందించిన ఘనతను కూడా గుర్తుచేశారు. జీ20 సదస్సు సమయంలో భారత్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను కూడా ఆయన ప్రస్తావించారు.

ప్రజాస్వామ్య రక్షణలో భారత్ పాత్ర

బాధ్యతాయుత ప్రజాస్వామ్య దేశంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు చేయూత అందిస్తోందని గుటెరెస్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మెజారిటీ వాటా కలిగి ఉన్నాయని, ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యధిక వాటా కలిగి ఉందని వివరించారు.

భద్రతా మండలి వైఫల్యమే విమర్శలకు కారణం

ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, అన్యాయాలు, అసమానతలు, పేదరికం, ఆకలి పెరుగుతున్నాయని, ఉగ్రవాదం వ్యాప్తి చెందుతోందని గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఐరాస వైపు చూస్తున్నాయని చెప్పారు. అయితే ఐరాస అంటే కేవలం భద్రతా మండలి మాత్రమే కాదని, 193 దేశాలకు సమాన ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు. భద్రతా మండలి కొన్ని దేశాలకే పరిమితమై ఉండటం వల్లే ప్రపంచ శాంతి భద్రతల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోందని, దీని వల్లే ఐరాస విమర్శలు ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు.

దిల్లీలో కీలక భేటీలు

ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026లో పాల్గొనేందుకు దిల్లీకి వస్తున్న గుటెరెస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలతో భేటీ కానున్నారు. అంతర్జాతీయ టెక్ కంపెనీల ప్రముఖులతోనూ సమావేశమవుతారు. ఐరాస ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానెల్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ సభ్యులతో దిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ ప్యానెల్‌లోని 40 మంది టెక్ నిపుణుల్లో ఐఐటీ మద్రాస్‌కు చెందిన బాలరామన్ రవీంద్రన్‌కు చోటు దక్కింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story