India–US Interim Trade Agreement: భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు
మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు

India–US Interim Trade Agreement: భారత్, అమెరికా దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం (ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్) ఖరారైంది. ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేసి ఈ విషయాన్ని అధికారికంగా తెలిపాయి. ఈ ఒప్పందం ద్వారా భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది ఇరు దేశాలకు పరస్పర లాభదాయకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం బలమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ మధ్యంతర ఒప్పందాన్ని చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఇది భారతీయ ఎగుమతిదారులకు సుమారు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను తెరుస్తుందని, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు భారీ ప్రయోజనాలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఎగుమతుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని ఆయన వివరించారు. దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ వస్తువులు, చేతివృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాలు వంటి కీలక రంగాలకు ఈ ఒప్పందం లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.
ఈ ఒప్పందంలో భాగంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు అంగీకరించింది. అమెరికా నుంచి భారీగా ఇంధనం, గ్యాస్‌ను దిగుమతి చేసుకునేందుకు, అలాగే 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించినట్లు అమెరికా వెల్లడించింది.
వ్యవసాయ రంగంలో రక్షణ: మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, నూనెగింజలు, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయ, పాల ఉత్పత్తులపై సుంకాల విషయంలో అమెరికాకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన ఉద్ఘాటించారు.
గతేడాది రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత వస్తువులపై అమెరికా విధించిన 25 శాతం అదనపు సుంకాలను తొలగిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ ఒప్పందం ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి రానుంది. రానున్న 10 ఏళ్లలో రక్షణ సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ఫ్రేమ్‌వర్క్‌కు కట్టుబడి ఉన్నాయని వెల్లడించాయి.
ఈ మధ్యంతర ఒప్పందం భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, ఆర్థిక సహకారానికి కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

