ఇరాన్ దాడి చేసినట్లు ప్రకటన

Iran Claims: ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో యుఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌ను ఢీకొట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడి తర్వాత నౌక పనిచేయడం ఆగిపోయిందని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని ఇరాన్ వెల్లడించింది. అయితే అమెరికా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

ఇరాన్ ఈ ప్రకటనను చేసిన నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. ఇరాన్ చేసిన దాడి ప్రకటనలు పూర్తిగా తప్పుడు సమాచారమని, యుఎస్‌ఎస్ అబ్రహం లింకన్ ఎలాంటి దెబ్బ తినలేదని తెలిపింది. ప్రస్తుతం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా నౌక సాధారణ కార్యకలాపాలు కొనసాగిస్తోందని, విమానాలు ఎగరవేస్తున్నట్లు పేర్కొంది.

అమెరికా మీడియా కథనాల ప్రకారం, ఇటీవల అబ్రహం లింకన్‌కు అతి సమీపంలో ఒక ఇరాన్ పడవ వచ్చింది. దీనిని గుర్తించిన అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. అయితే ఈ ఘటనలో నౌకకు ఏవైనా నష్టాలు జరిగాయా లేదా అనేది స్పష్టం కాలేదు.

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమవకముందు ట్రంప్ పాలనలో ఈ నౌకను దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించారు. ఇందులో ఎనిమిది స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉన్నాయి. ఎఫ్/ఏ-18 సూపర్ హార్నెట్, ఎఫ్-35సి స్టెల్త్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లతో సహా శక్తివంతమైన వైమానిక బలగాలు ఉన్నాయి. ఈ విమానాలు శత్రు దాడుల నుంచి నౌకను రక్షించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

విమాన వాహక నౌకలు సాగరంలో స్థిరంగా ఉండవు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కదులుతాయి. రియల్‌టైమ్ ఉపగ్రహ నెట్‌వర్క్ లేకుండా వాటి జాడ పట్టడం కష్టం. ప్రస్తుతం యుఎస్‌ఎస్ అబ్రహం లింకన్ అరేబియా సముద్రంలో ఇరాన్ తీరానికి దూరంగా వ్యూహాత్మక స్థానంలో సంచరిస్తోంది.

గతంలో కూడా ఇరాన్ ఇలాంటి ప్రకటనలు చేసింది. యుద్ధం మొదలైన మూడు రోజుల తర్వాత నాలుగు క్షిపణులతో దాడి చేశామని చెప్పింది. అప్పుడు కూడా అమెరికా ఆ ప్రకటనలను తోసిపుచ్చింది. ఇరాన్ వద్ద హైపర్‌సోనిక్, నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నప్పటికీ అమెరికన్ విమాన వాహక నౌకలను తాకడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు ఇరాన్ సమీపంలో మోహరించిన యుఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌకలో మంటలు చెలరేగినట్లు సమాచారం. లాండ్రీ ప్రదేశాల్లో ఈ మంటలు రాగా, వెంటనే ఆర్పేశారు. నౌక ప్రధాన యంత్రాలకు నష్టం జరగలేదు. ఇద్దరు నావికులు గాయపడ్డారు, వారి ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఎర్రసముద్రంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా నౌక కార్యకలాపాలు కొనసాగిస్తోందని సెంట్రల్ కమాండ్ తెలిపింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story