Iran Hit Hard: అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌కు భారీ దెబ్బ – కీలక సైనికాధికారి అలీ లారిజానీ, బసీజ్ బలగాల అధిపతి గులాం రెజా సాల్మనీ మృతి
కీలక సైనికాధికారి అలీ లారిజానీ, బసీజ్ బలగాల అధిపతి గులాం రెజా సాల్మనీ మృతి

టెహ్రాన్, బీరుట్‌లపై బాంబుల వర్షం.. గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి-డ్రోన్ దాడులు
Iran Hit Hard: పశ్చిమాసియా యుద్ధం 18వ రోజైన మంగళవారం ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలీషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు.
యుద్ధం మొదటి రోజున సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపిన తర్వాత ఇరాన్‌కు ఇంత భారీ స్థాయిలో నష్టం జరగడం ఇదే మొదటిసారి. మరోవైపు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పైనా, లెబనాన్ రాజధాని బీరుట్‌పైనా బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడులను కొనసాగించింది.
కీలక పదవులు నిర్వహించిన లారిజానీ
ఇరాన్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అలీ లారిజానీ పార్లమెంటు మాజీ స్పీకర్‌గా, విధాన నిర్ణయ సలహాదారుగా, అణు వ్యవహారాల్లో ఖమేనీకి సలహాదారుగా, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా, బసీజ్ బలగాల అధిపతిగా కీలక పదవులు నిర్వహించారు.
బసీజ్ బలగాల అధిపతి గులాం రెజా సాల్మనీ ఇటీవలి అల్లర్లను అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు. 1965లో జన్మించిన ఆయనపై అమెరికా, యూరోపియన్ దేశాలు సాంక్షన్లు విధించాయి.
భారీ పేలుళ్లు
టెహ్రాన్ ఉత్తర భాగంలోని సాదాబాద్ ప్యాలెస్‌తోపాటు సెంట్రల్ టెహ్రాన్, కరాజ్, షహ్రియార్, షిరాజ్ నగరాలపై దాడులు జరిగాయి. అరాక్‌లో జరిగిన దాడిలో 3 రోజుల బాబు, 2 ఏళ్ల సోదరి మరణించారు. వారి తల్లి, అమ్మమ్మ కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్ ఇరాన్‌లోని కమాండ్ సెంటర్లు, క్షిపణి లాంచ్ సైట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను లక్ష్యంగా చేసుకుంది. లెబనాన్‌లోని కాఫ్ర్‌లో జరిగిన దాడిలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల లెబనాన్‌లో 10 లక్షల మంది (మొత్తం జనాభాలో 20 శాతం) నిరాశ్రయులయ్యారు.
అమెరికా దాడిలో ఇరాన్‌లోని ఒక పాఠశాలలో 170 మంది మరణించినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధృవీకరించింది. చైనా ఇరాన్, లెబనాన్‌లకు అత్యవసర మానవతా సాయం అందించనున్నట్లు ప్రకటించి, యుద్ధ బాధితుల పట్ల సానుభూతి తెలిపింది.
ఫుజైరా మీద మళ్లీ దాడి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా ఆయిల్ ఫీల్డ్‌పై ఇరాన్ మరో డ్రోన్ దాడి చేసింది. అక్కడ ఒక ఆయిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ డ్రోన్-క్షిపణి దాడుల భయంతో యూఏఈ మంగళవారం తాత్కాలికంగా తన ఎయిర్ స్పేస్ మూసివేసింది. తర్వాత విమానాలు సాధారణంగా నడిచాయి. బనీ యాస్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఒక పాకిస్థానీయుడు మరణించాడు. ఇరాన్ 10 క్షిపణులు, 45 డ్రోన్లను ప్రయోగించింది.
సౌదీ అరేబియా ఇరాన్ నుంచి వచ్చిన డజను డ్రోన్లను అడ్డుకుంది. ఖతార్ రాజధాని దోహాలో 14 బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునేటప్పుడు పెద్ద పేలుళ్లు వినిపించాయి. ఇండస్ట్రియల్ ఏరియాలో మంటలు చెలరేగాయి. ఇరాక్‌లోని అమెరికా ఎంబసీపై మళ్లీ దాడి జరిగింది. నాలుగు డ్రోన్లను అడ్డుకునేటప్పుడు పేలుళ్లు సంభవించాయి. కువైట్‌లో ఆంబులెన్స్ సెంటర్‌పై దాడిలో ఇద్దరు వైద్య సిబ్బంది మరణించారు.
ఇజ్రాయెల్‌లోని తెల్ అవీవ్, గాలిలీ సముద్ర ప్రాంతాలపై దాడులు జరిగాయి. హెజ్బొల్లా నహరియాపై దాడి చేసింది. ఇరాన్ జెరూసలెం ఆధ్యాత్మిక స్థలాల వైపు డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది.
హార్ముజ్‌లో దక్షిణ కొరియా ఓడలు
దక్షిణ కొరియాకు వెళ్తున్న 26 ఓడలు, 183 మంది సిబ్బంది హార్ముజ్ ప్రాంతంలో చిక్కుకున్నట్లు ఆ దేశం తెలిపింది.
దుబాయ్ నుంచి అహ్మదాబాద్‌కు విద్యార్థులు
ఐఐఎం అహ్మదాబాద్ తన దుబాయ్ క్యాంపస్‌లో చదువుతున్న 35 విద్యార్థులను భారత్‌కు తరలించింది. యుద్ధం ప్రారంభమైనప్పుడు వారు స్పెయిన్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. గల్ఫ్ పరిస్థితులు సాధారణమైన వరకు వారికి అహ్మదాబాద్‌లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.
ట్రంప్ అమెరికా మీడియాపై ఒత్తిడి
ఇరాన్‌తో యుద్ధం తీవ్రమవుతుండగా ట్రంప్ పరిపాలన అమెరికా మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ఒత్తిడి పెంచింది. తమ ప్రభుత్వం కోరుకున్న దృక్పథం నుంచే వార్తలు ప్రసారం చేయాలని హెచ్చరించింది. ఏబీసీ న్యూస్ రిపోర్టర్ మరియం ఖాన్ అడిగిన ప్రశ్నపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏబీసీ న్యూస్ ప్రపంచంలోనే అత్యంత అవినీతి సంస్థ అని ఆగ్రహంగా అన్నారు.
యుద్ధం త్వరలో ముగుస్తుందని, ప్రపంచం సురక్షితమవుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను యుద్ధాలు కోరుకోనని, ప్రపంచ భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
ఇండియా స్పందన
పశ్చిమాసియా సంక్షోభాన్ని సంభాషణలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలని విదేశాంగ మంత్రి జైశంకర్ నొక్కి చెప్పారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి రంధీర్ జైశ్వాల్ తెలిపారు.

