Iran: మక్కా రక్షణ ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం.. పశ్చిమాసియాలో కీలక మార్పులు
పశ్చిమాసియాలో కీలక మార్పులు

Iran: పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు ‘మక్కా సమష్టి రక్షణ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో మరిన్ని దేశాలు చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్‌కు కూడా ఆహ్వానం అందినట్లు మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇరాన్ కీలక నేత మెహ్దీ రహీమీ ఈ ఆహ్వానంపై సమీక్ష జరుపుతున్నామని, ఇది టెహ్రాన్‌కు దక్కిన విజయమని పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ శాఖ ఇంకా ఈ ఆహ్వానాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతు ఉన్న హూతీల మధ్య తీవ్ర ఘర్షణలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఇరాన్‌కు ఈ ఆహ్వానం ఎలా వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అణ్వస్త్ర శక్తి ఉన్న పాకిస్థాన్, నాటో సభ్యదేశం తుర్కియే, చమురు సంపదతో నిండిన సౌదీ అరేబియా మధ్య ఏర్పడిన ఈ సంయుక్త రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నాటో కూటమి తరహాలోనే ‘ఏ ఒక్క సభ్య దేశంపై దాడి జరిగినా అది అందరిపై జరిగిన దాడిగా భావిస్తాం’ అనే నిబంధనను ఈ ఒప్పందంలో చేర్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఘర్షణలు మొదలైన తర్వాత పశ్చిమాసియాలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంత దేశాలు అమెరికా రక్షణ ఛత్రం నుంచి క్రమంగా బయటకు రావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ ఈ ఒప్పందంలో చేరితే హూతీలపైనే దాడులు చేయాల్సి రావచ్చు. అందుకే ఈ ఆహ్వానం ఎంతవరకు ఫలిస్తుందో ఇంకా చూడాల్సి ఉంది.

