Iran: అమెరికాపై 9/11 తరహా దాడులు: ఇరాన్ తీవ్ర హెచ్చరికలు – జాతీయ సంతాప దినాలు వస్తాయని బెదిరింపు
జాతీయ సంతాప దినాలు వస్తాయని బెదిరింపు

Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర హెచ్చరికలు, దాడుల బెదిరింపులతో పరిస్థితి విస్ఫోటనకరంగా మారింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఏ నౌకపైనా దాడి చేస్తే అమెరికాలోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై బాంబులు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు.
దీనికి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్ర స్పందన తెలిపింది. "అమెరికాపై 9/11 తరహా దాడులు చేస్తాం. ఘర్షణలు కొనసాగితే అమెరికా జాతీయ సంతాప దినాలు చేసుకోవాల్సి వస్తుంది" అని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ తస్నిమ్ హెచ్చరికలు చేసింది.
2001 సెప్టెంబర్ 11న అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ట్విన్ టవర్స్)పై జరిపిన దాడుల్లో 2,996 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైనదిగా నిలిచిపోయింది. ఆ సంఘటనను సూచిస్తూ ఇరాన్ ఈ బెదిరింపులు చేయడం గమనార్హం.
ఇరాన్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, "అమెరికా బలగాలు హర్మూజ్ నుంచి దూరంగా ఉంటేనే జలసంధి భద్రంగా ఉంటుంది. మేం చమురు అమ్మకపోతే ఇంకెవరూ అమ్మలేరు" అని వ్యాఖ్యానించారు.
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులు 12 రోజులుగా కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ టెహ్రాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేలా దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో యెమెన్ హూతీ తిరుగుబాటుదారులు సౌదీ చమురు ట్యాంకర్లపై దాడులు చేసినట్లు తెలిపారు. ఎర్ర సముద్ర ప్రవేశద్వారం బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు.
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు సృష్టిస్తున్నాయి.

