Iran: అమెరికా తమపై ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తే ఒక్క చుక్క చమురును కూడా ఎగుమతి చేయనీయమని ఇరాన్ స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ఈ తీవ్రమైన హెచ్చరికను జారీ చేశారు.

ఇరాన్‌పై అమెరికా కొత్త ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న సమయంలో రెజాయీ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక చర్యలు కొనసాగితే హోర్ముజ్ జలసంధి ద్వారా మాత్రమే కాకుండా పర్షియన్ గల్ఫ్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు కూడా ఎగుమతి కానివ్వమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఆర్థిక చర్యలకు మద్దతు ఇచ్చే లేదా వాటిలో భాగస్వాములయ్యే దేశాలను కూడా ఇరాన్ శత్రువులుగా పరిగణిస్తుందని, అలాంటి దేశాలపై ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉందని రెజాయీ హెచ్చరించారు.

మరోవైపు అమెరికా ఇరాన్‌పై భారీ ఆర్థిక ఆంక్షలకు సిద్ధమవుతోంది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ చర్యలను ‘ఎకనామిక్ డీ-డే’గా అభివర్ణించారు. ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగించే దేశాలు, సంస్థలపై కూడా కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన సూచించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై గరిష్ఠ ఒత్తిడి తీసుకురావడమే తమ లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. అయితే ఇరాన్ ఈ ఆంక్షలను ఎదుర్కొంటామని స్పష్టం చేస్తోంది.

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ మార్గంలో నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఈ వారాంతంలో 20 కంటే తక్కువ వాణిజ్య నౌకలు మాత్రమే హోర్ముజ్ గుండా వెళ్లినట్లు నౌకాయాన సమాచారం వెల్లడించింది. హోర్ముజ్ ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇరాన్-అమెరికా మధ్య ఆర్థిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి పరిస్థితి ప్రపంచం అంతా దృష్టి సారించి చూస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story