అమెరికా టెక్‌ దిగ్గజాలు లక్ష్యాలు!

Iran Issues Warning: అమెరికా మిత్ర దేశాల్లోని కీలక స్థావరాలపై ఇరాన్ తన దాడులను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న అమెరికా టెక్నాలజీ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) నిర్ణయం తీసుకుంది.

సైనిక చర్యలకు ఈ సంస్థల టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున వాటిని చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించాలని ఐఆర్‌జీసీ అనుబంధ వార్తా సంస్థ తస్నిం న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది.

ఈ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం మౌలిక సదుపాయాల వైపు విస్తరిస్తున్న కొద్దీ ఇరాన్ లక్ష్యాల పరిధి కూడా పెరుగుతోందని తాజా నివేదికలో పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్‌విడియా, ఒరాకిల్, పాలంటిర్ వంటి ప్రముఖ టెక్ సంస్థలతోపాటు ఇజ్రాయెల్ నగరాలు, గల్ఫ్ దేశాల్లో క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తున్న కొన్ని కార్యాలయాలు కూడా ఈ లక్ష్య జాబితాలో ఉన్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని, శత్రువులు తమకు ఈ స్వేచ్ఛ కల్పించారని ఐఆర్‌జీసీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలో ప్రజలు ఉండవద్దని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ పరిణామాలు మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story