Iran Ports Blockaded: ఇరాన్ ఓడరేవులు దిగ్బంధనం.. పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు!
పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు!

Iran Ports Blockaded: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాలకు వెళ్లే నౌకలను అమెరికా నౌకాదళం దిగ్బంధించింది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇరాన్‌కు నౌకల రాకపోకలను పూర్తిగా అడ్డుకునేందుకు భారీ బలగాలను మోహరించారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఇక భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. ఈ దిగ్బంధనంతో మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ రేవుల దిగ్బంధనానికి ప్రతిగా పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని అన్ని పోర్టులకు రాకపోకలను నిరోధిస్తామని టెహ్రాన్ హెచ్చరించింది. “పశ్చిమాసియాలో ఏ ఓడరేవూ సురక్షితం కాదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు, సరకుల రవాణా ప్రభావితం కావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ తగలనుంది.
అమెరికా వైపు నుంచి మరిన్ని హెచ్చరికలు వచ్చాయి. ఇరాన్ నౌకలు దిగ్బంధన ప్రాంతాల వద్దకు వచ్చినా పేల్చేయాలని ట్రంప్ తన బలగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా-ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామాలతో పశ్చిమాసియా మరోసారి నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని ప్రపంచం ఆందోళనలో ఉంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయ భాగం వెళ్తుంది. ఈ దిగ్బంధనం భారత్‌తో సహా అనేక దేశాలపై కూడా ప్రభావం చూపనుంది.
అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని కోరుతోంది. అయితే, రెండు వైపులా తీవ్ర వైఖరులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

