అణు ఒప్పందానికి సిద్ధం

Iran: అమెరికాతో అణు కార్యక్రమంపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి సిద్ధపడితే అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రకటించింది.

ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్తా రవంచి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. "ఆంక్షల ఎత్తివేత గురించి చర్చించడానికి అమెరికా సిద్ధంగా ఉంటే.. మా అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న అంశాలపై చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని ఆయన పేర్కొన్నారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి బంతి అమెరికా కోర్టులోనే ఉందని, వారు నిజాయితీగా ఒప్పందం కోరుకుంటే ఖచ్చితంగా అంగీకారం దిశగా అడుగులు వేయవచ్చని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య ఒమన్ వేదికగా పరోక్ష చర్చలు జరిగాయి. ఇవి సానుకూల దిశగా సాగాయని మాజిద్ తెలిపారు. త్వరలోనే జెనీవాలో రెండో రౌండ్ చర్చలు జరగనున్నాయి. అయితే, అన్ని ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలా లేక పాక్షిక ఉపశమనం సరిపోతుందా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఒప్పందానికి రాకపోతే సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇరాన్ తాజా ప్రకటన ఈ చర్చల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. అణు ఒప్పందం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు రెండు దేశాలకూ లభించాలని ఇరాన్ భావిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story